Darshan: నటుడు దర్శన్‌కు జైలులో రాజ భోగాలు

Darshan: నటుడు దర్శన్‌కు జైలులో రాజ భోగాలు
X
దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపించిన కన్నడ స్టార్ హీరో.. ఫొటో వైరల్

తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, చేతిలో సిగరెట్టు, కాఫీ కప్పుతో దర్శన్ ఫొటో ఒకటి బయటికి వచ్చింది. జైల్లో దర్శన్ ఇతర రిమాండ్ ఖైదీలతో (వారిలో ఒకరు దర్శన్ మేనేజర్) సరదాగా గడుపుతున్న వైనం ఆ ఫొటోలో చూడొచ్చు.

ఈ ఫొటో కాసేపట్లోనే వైరల్ అయింది. దాంతో, జైల్లో దర్శన్ కు రాజభోగాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జైలు అధికారులు అతడికి విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వాదనలు బయల్దేరాయి.

నటి పవిత్ర గౌడతో దర్శన్ సహజీవనం చేస్తున్న నేపథ్యంలో... దర్శన్ కాపురంలో నిప్పులు పోయొద్దంటూ దర్శన్ అభిమాని రేణుకాస్వామి నటి పవిత్రగౌడకు మెసేజ్ పంపించాడు. పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడంటూ రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, అత్యంత పైశాచికంగా హత్య చేశారు. ఈ ఘటనలో దర్శన్, పవిత్రగౌడతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మందికి ఆగస్టు 28 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.

కాగా, పరప్పన అగ్రహార జైల్లో దర్శన్ కు ప్రత్యేక బ్యారక్ ను కేటాయించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, జైల్లో అతడు స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించినట్టు జైలు అధికారులపై ఆరోపణలు వచ్చాయి.

కాగా జైల్లో దర్శన్ గుండు కొట్టించుకున్నాడని వినికిడి. ఇప్పటికే పలువురు జైలును సందర్శించి దర్శన్‌ను కలిశారు. పోలీసుల విచారణలో వాంగ్మూలం ఇవ్వడంతో నటుడు చిక్కన్న కూడా జైలుకు వెళ్లి దర్శన్‌తో మాట్లాడారు. కాబట్టి వీరికి మళ్లీ పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు దర్శన్ ఏ2గా ఉన్నారు. అయితే ఛార్జిషీటు సమర్పించే దశలో ఆయనను ఏ1గా మార్చే అవకాశాలున్నట్లు కూడా సమాచారం. మరోవైపు జైలులో ఉన్న తమ హీరో విడుదల కావాలని దర్శన్ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Tags

Next Story