Lamborghini crash case: లంబోర్గిని కారు ప్రమాదం కేసులో టుబాకో టైకూన్ కుమారుడి అరెస్ట్

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గత ఆదివారం జరిగిన లంబోర్గిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివమ్ మిశ్రా ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఖరీదైన కారు ఢీకొని ఆరుగురు గాయాలతో ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారును శివమ్ మిశ్రానే నడిపినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఆస్పత్రి నుంచే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. శివమ్ మిశ్రా కాన్పూర్‌లో ఉన్నట్లు సమాచారం అందగానే ఐదు బృందాలను ఏర్పాటు చేసి అతడిని పట్టుకున్నామని కన్పూర్ డీసీపీ తెలిపారు. అరెస్ట్ అనంతరం శివమ్ మిశ్రాను కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.
గత ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన లంబోర్గిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును ఢీకొని.. ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివమ్ కాదని, డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివమ్ తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని ఒప్పుకున్నాడు.
ఈ మేరకు శివమ్ తరఫు లాయర్ కోర్టు అఫిడవిట్ సమర్పించారు. ప్రమాదం జరిగినప్పుడు తానే కారు నడిపానని డ్రైవరే ఒప్పుకున్నప్పుడు శివమ్ కారు నడిపినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మీడియా పోలీసుల ముందు ప్రస్తావించగా.. ప్రమాదం సమయంలో శివమ్ కారు నడిపినట్లు సీపీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉందని చెప్పారు. దీనిపై వాళ్లు ఏం మాట్లాడినా తమకు సంబంధం లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
