Kapil Sibal: కాంగ్రెస్‌కి రాజీనామా చేసిన సీనియర్ నేత.. రాజ్యసభ సీటు కోసం ఆ పార్టీతో..

Kapil Sibal: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ రాజీనామా చేశారు. ఎస్పీ మద్దతుతో ఆయన యూపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. లక్నోలో నామినేషన్ వేయడానికి ముందు సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. తర్వాత ఆయన వెంటే వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈనెల 16నే తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్టు సిబల్ చెప్పుకొచ్చారు.
నామినేషన్ దాఖలు చేశాక ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని టార్గెట్ చేసిన G-23లో కపిల్ సిబల్ కూడా ఒకరు. పార్టీలో సంస్థాగత మార్పులు, నాయకత్వలేమిపై కొన్నాళ్లుగా హైకమాండ్‌ని టార్గెట్ చేస్తున్నారు సీనియర్లు. ఈ అసమ్మతి నేతలంతా తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి.. ఎస్పీలో చేరడం ఆ పార్టీ నుంచి రాజ్యసభ నామినేషన్ వేయడం సంచలనంగా మారింది.
దశాబ్దాలపాటు గాంధీలకు విధేయుడిగా ఉన్న సిబల్ పార్టీ వీడడం ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఉన్నట్టుండి సిబల్‌కి ఎస్పీ రాజ్యసభ టికెట్ ఇవ్వడం వెనుక ఆసక్తికర పరిణామం కనిపిస్తోంది. సమాజ్‌వాదీ ముఖ్యనేత అజంఖాన్‌కు సంబంధించిన కేసుల్ని సుప్రీంలో కపిల్ సిబలే వాదించారు. వారం కిందటే ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు.
రెండేళ్ల తర్వాత అజంఖాన్‌ను బయటకు తెచ్చినందుకు బహుమానంగానే సిబల్‌ను రాజ్యసభకు పంపుతున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ టర్మ్‌లో మొత్తం 11 స్థానాలు ఖాళీ అవుతుంటే అందులో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఎస్పీకి 3 దక్కనున్నాయి. ఈ స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నా అనూహ్యంగా కపిల్ సిబల్ ఇందులో చోటు దక్కించుకున్నారు. ఆయన నామినేషన్ కూడా ఫైల్ చేయడంతో ఎన్నిక లాంఛనం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com