Period Leave : వేతనంతో కూడిన పీరియడ్ లీవ్‌ అమల్లోకి తెచ్చిన కర్ణాటక సర్కార్

Period Leave : వేతనంతో కూడిన పీరియడ్ లీవ్‌ అమల్లోకి తెచ్చిన కర్ణాటక సర్కార్
X
సెలవు కోసం ఎలాంటి వైద్య ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని స్పష్టం చేసిన విద్యాశాఖ

మహిళా సాధికారత దిశగా కర్ణాటక ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, పని సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏడాదికి 12 రోజుల పాటు 'రుతుక్రమ సెలవుల' సౌకర్యాన్ని కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, విద్యాశాఖ కమిషనర్ వికాస్ సురల్కర్ ఈ సర్క్యులర్‌ను విడుదల చేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. నెలకు ఒకరోజు చొప్పున వేతనంతో కూడిన ఈ సెలవును మహిళలు పొందవచ్చు. మహిళా ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఒక నెలకు సంబంధించిన సెలవును అదే నెలలో ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోని సెలవులు తర్వాతి నెలకు బదిలీ కావు. ఈ సెలవు కోసం మహిళలు ఎలాంటి డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన పనిలేదు. సెలవు మంజూరు చేసే అధికారికి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. ఇతర సాధారణ సెలవులతో సంబంధం లేకుండా, రుతుక్రమ సెలవులను అటెండెన్స్ రిజిస్టర్‌లో విడిగా నమోదు చేస్తారు.ఈ సెలవును ఇతర రకాల సెలవులతో కలిపి వాడుకోవడానికి అనుమతి ఉండదు.

సెలవు తీసుకునే సమయంలో ఆఫీసులో పెండింగ్‌లో ఉన్న అత్యవసర ఫైళ్లు లేదా కోర్టు కేసుల వివరాలను సంబంధిత అధికారులకు ముందుగానే తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. సెలవు వల్ల కార్యాలయ పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుందని స్పష్టం చేసింది.

భారతదేశంలో కేరళ, బీహార్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి సెలవులను అమలు చేస్తుండగా, ఇప్పుడు కర్ణాటక కూడా ఆ జాబితాలో చేరింది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న లక్షలాది మంది మహిళలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Tags

Next Story