Muda Scam: సిద్ధరామయ్యపై ఈడీ కేసు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు అయింది. ముడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు. ఈ స్కామ్‌పై తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. రాష్ట్ర లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సిద్ధరామయ్య, మరికొందరిపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు శుక్రవారం సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య బీఎం పార్వతిని ఏ2గా, బావమరిది మల్లికార్జున స్వామిని ఏ3గా, దేవరాజును ఏ4గా పేర్కొన్నది. దేవరాజు వద్ద నుంచే మల్లికార్జున స్వామి భూమిని కొని పార్వతికి బహుమతిగా ఇచ్చాడని చెప్తున్నారు. తక్కువ విలువ కలిగిన ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) సేకరించి, పరిహారంగా పార్వతికి ఖరీదైన 14 స్థలాలను కేటాయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా వీరిపై తాజాగా ఈడీ ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదుచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం దర్యాప్తు సమయంలో నిందితులను ప్రశ్నించేందుకు, వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీకి అధికారం ఉంది.
తనకు ప్రభుత్వం కేటాయించిన 14 స్థలాలను వెనక్కి ఇచ్చేస్తానని సిద్ధరామయ్య సతీమణి పార్వతి. ముడా కమిషనర్‌కు లేఖ రాశారు. తన నుంచి ప్రభుత్వం తీసుకున్న కేసరె గ్రామంలోని మూడెకరాల 16 గుంటల భూమికి బదులుగా ముడా మైసూర్‌లోని విజయనగర్‌లో 14 ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించిందని, అయితే దానికి సంబంధించిన సేల్‌డీడ్‌ను రద్దు చేయడం ద్వారా స్థలాలు వెనక్కి ఇచ్చేయడానికి తాను సిద్ధమని ముడా కమిషనర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఈ భూముల కేటాయింపుకు సంబంధించి సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణ నేపథ్యంలోనే ఆమె ఈ లేఖ రాసినట్టు భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com