అసెంబ్లీ గెలిచాం.. ఇక లోక్ సభ సీట్లు గెలవాలి: సిద్దరామయ్య

కొత్త మంత్రులకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తర్వాత సిద్ధరామయ్య సీఎంగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వారందరికీ సిద్ధరామయ్య లక్ష్యాలను నిర్దేశించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో గెలుపొందేలా కృషి చేయాలని సూచించారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం సిద్ధరామయ్య టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో సత్తా చాటి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రతి మంత్రి తమ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుని గెలుపే లక్ష్యంగా నిజాయితీతో పనిచేయాలన్నారు. గతంలో చేసిన తప్పులను మరోసారి చేయొద్దని ఈ సందర్భంగా సిద్ధరామయ్య మంత్రులతో చెప్పినట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మంత్రులకు శాఖల కేటాయిస్తామని సిద్ధరామయ్య చెప్పారు. మంత్రులు తరచుగా తమ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అధికారులపై గట్టి నిఘా ఉంచాలని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. గత నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సిద్ధరామయ్య టీం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com