Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు అరెస్ట్ తప్పదా

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు అరెస్ట్ తప్పదా
X
ముడా కుంభకోణంలో అడ్డంగా బుక్కైన కర్ణాటక సీఎం

వేల కోట్ల రూపాయల అక్రమాలు చోటుచేసుకున్న మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అడ్డంగా బుక్కయ్యారు! ఈ స్కామ్‌కు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణను ఎదుర్కోనున్నారు. దీంతో అధికార కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై విచారణకు రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ శనివారం అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్టు సీఎం కార్యాలయం కూడా నిర్ధారించింది. దీంతో సిద్ధరామయ్యకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తనపై విచారణకు గవర్నర్‌ అనుమతినివ్వడంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్టవ్యతిరేకమని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే బీజేపీ, జేడీఎస్‌ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. తాను రాజీనామా చేసేంత తప్పేమీ చేయలేదన్నారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ముడా కుంభకోణం ఆరోపణలను గతంలోనూ సిద్ధరామయ్య ఖండించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. రింగ్‌ రోడ్డుకు సమీపంలో తన భార్య పేరిట 3.16 ఎకరాల భూమి ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.

అసలు ఏమిటీ స్కాం?

బీజేపీ నేతలు, హక్కుల కార్యకర్తల ఆరోపణల ప్రకారం.. మైసూరు శివారులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అయితే, అవసరాల దృష్ట్యా ఆ భూమిని సేకరించిన ప్రభుత్వం.. దానికి బదులుగా నగరం లోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే విజయనగర్‌, దట్టగల్లీ, జేపీ నగర్‌, ఆర్టీ నగర్‌, హంచయా-సతాగల్లీలో సిద్ధరామయ్య కుటుంబానికి 38,283 చదరపు అడుగుల భూమిని కేటాయించింది. 50:50 నిష్పత్తిలో (పడావు పడ్డ ఒక ఎకరా తీసుకొంటే, అభివృద్ధి చేసిన అర్ధ ఎకరం ఇవ్వడం) ఈ కేటాయింపు జరిగింది. అయితే, కెసరెలోని భూములతో పోలిస్తే మార్కెట్‌ ధర అతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిద్ధరామయ్య కుటుంబానికి ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని బీజేపీ నేత ఆర్‌ అశోక్‌ నిలదీశారు.

క్యాబినెట్‌ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని, ముఖ్యమంత్రికి తెలియకుండానే రూ. 4 వేల కోట్ల విలువజేసే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. ముడా భూకుంభకోణంలో సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర పాత్ర ఉన్నదని, ఆయనే దీనికి అసలు సూత్రధారని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్‌ విశ్వనాథ్‌ ఆరోపించారు. ఈ స్కామ్‌ మూలంగా వేల కోట్లు పక్కదారి పట్టాయని ముగ్గురు హక్కుల కార్యకర్తలు ప్రదీప్‌ కుమార్‌, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ.. లోకాయుక్త పోలీసులు సహా గవర్నర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్‌ సీఎంపై విచారణకు అనుమతినిచ్చారు.

Tags

Next Story