DK Shivakumar: అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాలాపనపై డీకే క్షమాపణలు

కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గీతం ఆలపించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీలో వివాదం రేగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం ఎలా పాడుతారంటూ పార్టీ నేతలు పలువురు డీకే పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా స్పందిస్తూ.. ఆర్ఎస్ఎస్ గీతాలాపనతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోకను విమర్శించడానికి తాను ఆర్ఎస్ఎస్ గీతాన్ని పఠించానని.. అంతేకాని ఆ సంస్థను ప్రశంసించడానికి కాదని శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే కావడానికి ముందు 47 ఏళ్ల వయసులో తాను రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశానని… కాంగ్రెస్, గాంధీ కుటుంబం, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, జనతాదళ్ (లౌకిక), కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పార్టీల చరిత్రను అధ్యయనం చేసినట్లు వివరించారు. రాజకీయ లాభం కోసం తన మాటలను దుమారం రేపుతున్నారని తప్పుపట్టారు.
గాంధీ కుటుంబాన్ని ఎవరూ ప్రశ్నించలేరని.. తాను పుట్టుకతోనే కాంగ్రెస్ సభ్యుడ్ని అన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగానే చనిపోతానని ప్రకటించారు. తనను సమర్థించిన, విమర్శించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత, నిబద్ధతతో మనమందరం కలిసి పనిచేద్దామని సహచర నేతలకు పిలుపునిచ్చారు.
అసలేం జరిగిందంటే..
కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి. సమావేశాల చివరి రోజు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రసంగించారు. తన ప్రసంగంలో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని ఆలపించడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. డీకే శివకుమార్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బికె హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని పార్టీల ప్రజలకు చెందినది కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా డీకే ఆర్ఎస్ఎస్ గీతం పాడితే తప్పులేదని ఆయన అన్నారు. అయితే, డీకే ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారని హరిప్రసాద్ గుర్తుచేశారు. దీనిపైనే పార్టీ వర్గాల్లో అభ్యంతరం వ్యక్తమవుతోందని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com