Cauvery Water: కావేరీ జలాల కోసం.. కర్ణాటక రైతులు

Cauvery Water: కావేరీ జలాల  కోసం.. కర్ణాటక రైతులు
రాత్రంతా రైతుల ఆందోళన..రేపు ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం శివకుమార్

తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ కొందరు కర్ణాటక రైతులు శ్రీరంగపట్నం సమీపంలోని మాండ్యలో రాత్రంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కావేరీ నదిలో ఈ సారి వర్షాభావ పరిస్థితులతో ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడం లేదు. ఇదే సమయంలో తమకు తాగు నీటికి జలాలు విడుదల చేయాలని తమిళనాడు కోరింది. అయితే, రిజర్వాయర్‌లో నీటి కొరత కారణంగా మా రైతులకు సరిపోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని రైతాంగం కోరుతున్నారు, ఈ నేపద్యం లోనే ఆందోళనకు దిగారు.


తమిళనాడు.. కర్ణాటక ప్రస్తావన రాగానే ముందుగా కావేరి నదీజలాల అంశం గుర్తుకొస్తుంది.. అలాగే కావేరి పేరు చెప్పినా రెండు రాష్ట్రాల మధ్య రచ్చ చర్చ తప్పకుండా వస్తుంది.. కావేరి జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం.. వాటి ఉల్లంఘన.. దానికి సంబంధించిన వివాదం షరా మామూలే.. ప్రతి ఏడాది ఈ రచ్చ తప్పదు.. కావేరి మేనేజ్మెంట్ బోర్డు ఉన్నా రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు.. చర్చలు.. సంప్రదింపులు ఏవి పనిచేయవు. సమస్య పరిష్కారం కోసం 1990లో కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. అయినా పెద్ద ఫలితం లేదు . ఇప్పుడు కూడా అదే జరిగింది.



అయితే, తమిళనాడుకు తాగునీటికి కావేరీ జలాలే పెద్ద దిక్కు. దీంతో తమకు రోజూ 24వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు అభ్యర్థనపై కావేరీ జలాల నియంత్రణ కమిటీ సానుకూలంగా స్పందించింది. 15 రోజుల పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల విడుదల చేయాలని నిర్ణయించింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పొరుగు రాష్ట్రానికి నీటిని విడుదల చేయలేకపోవడంపై కర్ణాటక తొలుత అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇరు రాష్ట్రాల అభ్యర్థన మేరకు సీడబ్ల్యూఆర్సీ మధ్యే మార్గంగా ఈ నిర్ణయం తీసుకుంది.


అయితే వర్షాభావ పరిస్థితులు, తమిళనాడుకు నీటి విడుదల కారణంగా కావేరీ బేసిన్‌లో నీటి నిల్వ తగ్గుతోందని.. నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం నిరసనకు దిగారు.కావేరి జలాల అంశంపై చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లనుండగా.. తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయితేనే కావేరీ జలాలు విడుదల చేస్తామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కర్ణాటక అఫిడవిట్ దాఖలు చేసింది. రిజర్వాయర్లను ఖాళీ చేయడంతోపాటు తాగునీటికి ఎద్దడి ఏర్పడుతుందని, తమిళనాడుకు నీటి విడుదల చేయలేమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. 3 వేల క్యూసెక్కులకు మించి ఇవ్వలేమని శివకుమార్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం కోసం ఆయన ఢిల్లీ పయనమవుతున్నారు.


.

Tags

Read MoreRead Less
Next Story