Karnataka : హుక్కాపై తక్షణ నిషేధం
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా తాగడంపై నిషేధం విధించింది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. హుక్కా తాగడం (Hookah smoking) వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా హుక్కాను నిషేధిస్తున్నామని చెప్పారు. భవిష్యత్ తరాలకు మెరుగైన, సురక్షితమైన ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు. యువత హుక్కాబార్లకు ఆకర్షితులవుతున్నారని, ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని తెలిపారు.
. పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో గతేడాది సెప్టెంబర్ నెలలో హుక్కా బార్లను నిషేధించిన ప్రభుత్వం, పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును 18 నుంచి 21 ఏండ్లకు పెంచింది. పాఠశాలలు, ఆలయాలు, మసీదులు, శిశు సంరక్షణ కేంద్రాలు, దవాఖానల చుట్టుపక్కల పొగాకు వాడకం, విక్రయాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది.
గతేడాది ఇదే తరహాలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.అయితే, హర్యానాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే సాంప్రదాయ హుక్కాలకు ఈ నిషేధం వర్తించదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com