Karnataka: కర్ణాటకలో మళ్లీ హిజాబ్ వివాదం

Karnataka: కర్ణాటకలో మళ్లీ హిజాబ్ వివాదం
హిజాబ్‌ ధరించటంపై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక సర్కార్‌

మైసూరు జిల్లాలో శుక్రవారం పర్యటించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విద్యా సంస్థల్లో హిజాబ్‌ ధరించడంపై ఉన్న నిషేధాన్ని తాము ఎత్తివేస్తామని ప్రకటించారు. నంజనగూడు సభలో పాల్గొన్న సీఎం ప్రజలు దుస్తులు, ఆహారం ఎంచుకునే విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని స్పష్టంచేశారు. సబ్‌ కా సాత్, సబ్‌ కా విశ్వాస్ గురించి ప్రకటనలు చేసే భాజపా ఇలా నిషేధం విధించడంలో అర్థమేమిటని సిద్ధరామయ్య ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య ప్రకటనపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్ శనివారం చాలా తీవ్రంగా స్పందించారు. విపక్ష కూటమి దేశంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఇస్లామిక్‌ చట్టాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు.

కర్ణాటకలో భాజపా సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సైతం కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుబట్టారు. లోక్‌సభ సహా ఏ ఎన్నికల్లో సిద్ధరామయ్య నిర్ణయం వారికి ఏమాత్రం ఉపయోగపడదన్నారు. వెంటనే ఆ ప్రకటనను.. ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్థించింది. సీఎం చేసిన ప్రకటనలో ఎలాంటి తప్పులేదని, చట్టపరంగానే... ఆయన ప్రకటన ఉందని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పారు. సీఎం ప్రకటనకు లోక్‌సభ ఎన్నికలకు ఎలాంటి సంబంధంలేదన్నారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2022లో విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించింది. ఆ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. శుక్రవారం మైసూరులో సీఎం సిద్దరామయ్య హిజాబ్‌పై నిషేధానికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏ డ్రెస్సు వేసుకోవాలి, ఏ ఆహారం తినాలనేవి వ్యక్తిగతమని, ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఆయన వ్యాఖ్యానించారు.నేపథ్యంలో చదువుకు దూరమైన కర్ణాటక యువతి ముస్కాన్ ఖాన్..తాజాగా నిషేధం ఎత్తివేతపై హర్షం వ్యక్తం చేసింది. ‘‘హిజాబ్‌పై వివాదం నేపథ్యంలో నేను చదువును వదులుకోవాల్సి వచ్చింది. ఇకపై విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణకు అనుమతిస్తామని సీఎం ప్రకటించారు. కాబట్టి నేను చదువును కొనసాగిస్తా’’ అని ఆమె పేర్కొంది గతేడాది ఏప్రిల్‌లో ముస్కాన్ మూడో సెమిస్టర్‌కు హాజరు కావాల్సి ఉంటుండగా చదువుకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె అదే సెమిస్టర్ నుంచి చదువు పునఃప్రారంభించాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story