Alimony: నెలకు రూ.6 లక్షల భరణం కావాలన్న భార్య, కోర్ట్ ఏం చెప్పిందంటే.
మాజీ భర్త నుంచి భారీగా మనోవర్తి పొందాలనుకున్న మహిళకు కర్ణాటక హైకోర్టు మహిళా న్యాయమూర్తి గట్టి షాక్ ఇచ్చారు. ‘అంత సొమ్ము కావాలంటే ఆమెనే సంపాదించుకోమనండి’ అని ఆమె తరపు న్యాయవాదికి చెప్పారు. భరణం అనేది భర్తకు శిక్షగా ఉండకూడదని తెలిపారు. న్యాయమూర్తి, న్యాయవాది మధ్య హైకోర్టులో జరిగిన సంభాషణ వీడియోను దీపిక నారాయణ్ భరద్వాజ్ అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు.
దీని ప్రకారం, పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఆమెకు నెలకు రూ.6,16,300 భరణం కింద చెల్లించే విధంగా ఆమె మాజీ భర్తను ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, ఎవరైనా నెలకు రూ.6 లక్షలు ఏ విధంగా ఖర్చు పెట్టగలరని ప్రశ్నించారు. ఇది అసమంజసంగా ఉందన్నారు.
దీనిపై న్యాయవాది వివరణ ఇస్తూ, పిటిషనర్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, చికిత్స, ఫిజియోథెరపీ, మందులు, ఇతర ఖర్చుల కోసం నెలకు రూ.4-5 లక్షలు అవసరమవుతాయని చెప్పారు. గాజులు, చెప్పులు, శాండల్స్, గడియారాలు వంటివాటి కోసం నెలకు రూ.50,000; ఆహారం కోసం రూ.60,000 కావాలన్నారు. ఆమె మాజీ భర్త అన్నీ బ్రాండెడ్ దుస్తులనే ధరిస్తారని, రూ.10,000 విలువైన కెల్విన్ క్లీన్ టీ-షర్టులు ధరిస్తారని చెప్పారు.
కానీ ఆమె పాత దుస్తులతోనే సరిపెట్టుకోవలసి వస్తుందన్నారు. అయితే ఆమె పిల్లల స్కూలు, ట్యూషన్ ఫీజును మాజీ భర్త చెల్లిస్తున్నట్లు అంగీకరించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, ‘ఓ వ్యక్తికి ఇవన్నీ అవసరమని మీరు కోర్టుకు చెప్పవద్దు. రూ.6,16,300 ఓ నెలకా? ఎవరైనా ఇంత సొమ్ము ఖర్చుపెడతారా?” అన్నారు. “సరే, అంత ఖర్చు చేయాలనుకుంటే, ఆమెను సంపాదించుకోమనండి. ఆమె భర్తపై ఆ భారం మోపవద్దు” అని చెప్పారు. ‘ఇంత సొమ్మును డిమాండ్ చేయడం అసమంజసమని మీ క్లయింటుకు వివరించండి’ అని తెలిపారు. ఆమెకు ఇతర కుటుంబ బాధ్యతలేవీ లేవని, పిల్లల సంరక్షణ చూడవలసిన అవసరం లేదని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com