Menstrual Leave for: నెలసరి సమయంలో కర్ణాటక ప్రభుత్వం సెలవు..వైద్య ధృవీకరణ పత్రాలు అవసరం లేకుండానే

మహిళలు నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.. చేసే పని ఏదైనా సరిగా చేయలేకపోతారు.. ఈ సమయంలో ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.. ఆ సమయంలో కడుపునొప్పి వాళ్లను తీవ్రంగా వేధిస్తుంది.. అయితే, మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పిన కర్ణాటక ప్రభుత్వం నెలసరి సమయంలో సెలవు విధానాన్ని ప్రవేశపెట్టింది.. ఇది పరిశ్రమలలో 18–52 సంవత్సరాల వయస్సు గల మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన రోజును మంజూరు చేస్తుంది.. వైద్య ధృవీకరణ పత్రాలు అవసరం లేకుండా ఈ సెలవు పొందవచ్చు..
కార్యాలయాన్ని ఆరోగ్యవంతంగా మార్చే విప్లవాత్మక చర్యలో భాగంగా, కర్ణాటక ప్రభుత్వం బుధవారం అన్ని ఉద్యోగ మహిళలకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన రుతుక్రమ సెలవును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 18 నుంచి 52 సంవత్సరాల మధ్య వయస్సు గల, శాశ్వత, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్స్ ఉద్యోగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. గత నెలలో కర్ణాటక మంత్రివర్గం రుతుక్రమ సెలవు విధానాన్ని ఆమోదించింది. దీనితో, అటువంటి నియమాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది..
18 నుండి 52 సంవత్సరాల మధ్య వయస్సు గల శాశ్వత, కాంట్రాక్ట్, ఔట్‌సోర్స్ మహిళా ఉద్యోగులందరికీ వారి రుతుచక్రంలో సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన సెలవును అంటే.. నెలకు ఒక రోజు అందించాలని సంబంధిత యజమానులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఇది ఫ్యాక్టరీల చట్టం, 1948; కర్ణాటక దుకాణాలు మరియు వాణిజ్య సంస్థల చట్టం, 1961; తోటల కార్మికుల చట్టం, 1951; బీడీ మరియు సిగార్ కార్మికులు (ఉపాధి పరిస్థితులు) చట్టం, 1966; మోటారు రవాణా కార్మికుల చట్టం, 1961 కింద నమోదు చేయబడిన అన్ని పరిశ్రమలు మరియు ఆ సంస్థలలో పనిచేసే మహిళలకు వర్తిస్తుంది, వారి ఆరోగ్యం, సామర్థ్యం మరియు పనితీరును పెంచడంతో పాటు వారి మానసిక శ్రేయస్సును పెంచడం అనే మంచి ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రతి నెలా ఒక రోజు ఋతు సెలవు పొందడానికి మహిళా ఉద్యోగి ఎటువంటి వైద్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదని ఆ ఉత్తర్వు స్పష్టం చేస్తుంది. ఆ ఉత్తర్వు ప్రకారం, మహిళా ఉద్యోగులు ఆ నెలలోనే ఋతు సెలవును ఉపయోగించుకోవాలి.. కానీ, దానిని తదుపరి నెలకు మార్చుకునే వెసులుబాటు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది..
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

