Karnataka: అన్న ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించి కాలిపోయిన తమ్ముడు..

పోలీసుల కథనం ప్రకారం.. మునిరాజ్ అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా స్థానికంగా చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆ వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో, తమకున్న పూర్వీకుల భూమిని అమ్మి అప్పులు తీర్చుకుందామని తన అన్న రామకృష్ణను కోరాడు. అయితే రామకృష్ణ అందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
అన్న కుటుంబాన్ని చంపాలని ప్లాన్
ఈ కోపంతో రామకృష్ణ కుటుంబంపై పగ పెంచుకున్న మునిరాజ్ మంగళవారం అర్ధరాత్రి తన అన్న ఇంటికి చేరుకున్నాడు. ఎవరూ బయటకు రాకుండా ఇంటికి బయట నుంచి గడియ పెట్టి, లోపలికి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆ సమయంలో పెట్రోల్ అతని చేతులు, దుస్తులపై పడటంతో క్షణాల్లో మునిరాజ్‌కు కూడా మంటలు అంటుకున్నాయి.
మునిరాజ్ ఆర్తనాదాలు విన్న పొరుగువారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని హోసకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న రామకృష్ణ కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. రామకృష్ణ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ ఫుటేజీని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

