Karnataka: అసెంబ్లీలో కునుకు తీసేందుకు రిైక్లెనర్లు

కర్ణాటక శాసన సభ్యులు లంచ్ తర్వాత కునుకు తీసేందుకు ఈ అసెంబ్లీ సమావేశం నుంచి రిైక్లెనర్లు ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ తెలిపారు. సమావేశాల సందర్భంగా చాలామంది లంచ్ తర్వాత సభా కార్యక్రమాలకు హాజరు కాకుండా గైర్హాజరవుతున్నారని, దీనిని నివారించడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మార్చి 3 నుంచి 21 వరకు జరిగే సమావేశాల కోసం తాత్కాలికంగా 15 రిైక్లెనర్లను అద్దెకు తెస్తున్నామన్నారు. ఒక్క సమావేశాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో వీటి ఉపయోగం ఉండనందున వాటిని కొనుగోలు చేయకుండా కేవలం అద్దెకు మాత్రమే తీసుకువస్తున్నామన్నారు. సమావేశాలు ముగిసిన వెంటనే వాటిని పంపేస్తామన్నారు.
ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ (విధాన సౌధ)లో ఎమ్మెల్యేలకు ఉదయం 9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయటకు వెళ్లి, తిరిగి ఆలస్యంగా అసెంబ్లీలోకి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. 2023 జులైలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ సెషన్‌లో కూడా ప్రయోగాత్మకంగా రిక్లైనర్ కుర్చీలను వినియోగించారు. వాటిని ఎమ్మెల్యేలు వినియోగించుకుని, ఎంతో సౌకర్యంగా ఫీలయ్యామని స్పీకర్ ఖాదర్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు మరింత ఎక్కువ సంఖ్యలో ఆ కుర్చీలను అందుబాటులోకి తెచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. ఈ సౌకర్యం వల్ల ఎమ్మెల్యేల హాజరు, పనితీరు, ఉత్పాదకత పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com