Karnataka: కర్నాటకలో రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు.. నాలుగు సీట్లకు ఆరుగురు పోటీ..

Karnataka: కర్నాటకలో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. కర్నాటక నుంచి నాలుగు రాజ్యసభ సీట్లకు గాను ఆరుగురు పోటీపడుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సినీ నటుడు జగ్గేశ్, పారిశ్రామికవేత్త లెహర్‌సింగ్ బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరపున జైరాం రమేష్, మన్సూర్ ఆలీఖాన్ బరిలో ఉన్నారు. జేడీఎస్ నుంచి కుపేంద్రరెడ్డి నామినేషన్ వేశారు. అయితే, కర్నాటక అసెంబ్లీలో బీజేపీకి 122 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్కో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే 45 ఓట్లు అవసరం. కాని బీజేపీ మాత్రం మూడో అభ్యర్ధిని నిలబెట్టింది.
రాజ్యసభకు మూడో అభ్యర్ధిని పంపించాలంటే బీజేపీకి ఇంకా 13కు పైగా ఓట్లు కావాలి. అయినా సరే.. గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇక కాంగ్రెస్‌కు 71 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ తన రెండో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఇంకా 19 ఓట్లు కావాలి. అయినా సరే రెండో అభ్యర్ధిని నిలబెట్టింది. జేడీఎస్‌కు 32 మంది బలం ఉంది. రాజ్యసభ అభ్యర్ధిని గెలిపించుకునేందు బలం లేకపోయినా సరే పోటీ చేస్తోంది. జేడీఎస్ అభ్యర్థి కుపేంద్రరెడ్డిని గెలిపించుకునేందుకు మాజీ ప్రధాని దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగారు.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాతో ఫోన్‌లో చర్చలు జరిపారు. రాజ్యసభ ఎన్నికలో ఎవరి మద్దతు లేకుండానే మూడో అభ్యర్థి లెహర్ సింగ్‌ను గెలిపించుకుంటామని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై ధీమాగా చెబుతున్నారు. తమ పార్టీకి ఉన్న రెండో ప్రాధాన్యత ఓట్లతోనే మూడో అభ్యర్థి గెలుస్తాడని చెప్పుకొచ్చారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీఎల్పీ సమావేశమైంది. నాలుగో సీటు గెలవడం కోసం కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పనిచేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
అయితే, జేడీఎస్ తన రెండో అభ్యర్థిని వెనక్కు తీసుకోవాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. బీజేపీని ఓడించాలనే లక్ష్యమే గనక కాంగ్రెస్‌కు ఉంటే.. జేడీఎస్‌కు సహకరించాలని, రెండో ప్రాధాన్యత ఓట్లను రెండు పార్టీలు పంచుకోవాలని జేడీఎస్ నేత కుమారస్వామి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. గతంలో ఏం జరిగిందన్నది మరిచిపోవాలని, కర్నాటక భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ దిగిరావాలని సూచించారు. అయితే, మాజీ సీఎం సిద్ధరామయ్య మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
జేడీఎస్ తన అభ్యర్థిని ఉపసంహరించుకుంటానంటేనే ఆ పార్టీతో చర్చలు జరుగుతాయంటూ అల్టిమేట్టం ఇచ్చారు. 2020లో మాజీ ప్రధాని దేవెగౌడను రాజ్యసభకు పంపించడానికి కాంగ్రెస్ సహాయం చేసిందని, ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే అవకాశం జేడీఎస్‌కు వచ్చిందని కర్నాటక కాంగ్రెస్ నేతలు కామెంట్ చేశారు. ఇక తమ ఎమ్మెల్యేలు ఎక్కడ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారోనన్న భయంతో రిసార్ట్ రాజకీయం మొదలుపెట్టారు జేడీఎస్ నేత కుమారస్వామి. ప్రస్తుతం జేడీఎస్ ఎమ్మెల్యేలంతా దేవనహళ్లి పరిసరాల్లోని రిసార్టుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజస్తాన్‌లోనూ క్యాంపు పాలిటిక్స్ నడుస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌కు తరలించింది. రాజస్తాన్‌లో 4 రాజ్యసభ స్థానాలు ఉండగా.. మీడియా ప్రముఖుడు సుభాష్‌చంద్ర కాంగ్రెస్‌కు పోటీగా నామినేషన్ వేశారు. సుభాష్‌కు బీజేపీ మద్దతు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయకుండా క్యాంప్ ఏర్పాటు చేసింది. సొంత నేతలు, తమకు మద్దతు పలుకుతున్న ఇతర పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేలనూ ఉదయ్‌పూర్‌కు తరలించింది. మొత్తానికి రేపు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎవరిది గెలుపో, ఎవరిది ఓటమో మరికొన్ని గంటల్లో తేలనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com