Karni Sena chief: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

Karni Sena chief: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
హత్య కేసులో తొలి అరెస్టు

రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి హత్య కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో ఇద్దరు సుఖ్‌దేవ్‌ సింగ్‌పై కాల్పులు జరిపిన వాళ్లు కాగా, మరో వ్యక్తి ఈ హత్య కోసం నిందితులకు సహకరించినట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితులు ముగ్గురిని తాము అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీంద్ర యాదవ్‌ వెల్లడించారు.

కేసు నమోదైనప్పటి నుంచి నిందితులను నిరంతరాయంగా ట్రాక్‌ చేశామని, చివరికి చండీగఢ్‌లో వాళ్లు పట్టుబడ్డారని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత నిందితులు ముగ్గురిని రాజస్థాన్‌ పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. కాగా, కొద్దిసేపటి క్రితం నిందితులను పోలీసులు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ కార్యాలయం నుంచి బయటికి తీసుకెళ్లిన దృశ్యాలు నేషనల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

కాగా, ఈ నెల 5న జైపూర్‌లోని తన నివాసంలో రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. బైకు మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు సుఖ్‌దేవ్‌ సింగ్‌తో మాట్లాడుతున్నట్టుగా నటించి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కుటుంబసభ్యులు సుఖ్‌దేవ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.


జైపూర్‌లో ఈనెల 5న సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది తన ఇంట్లో నలుగురు వ్యక్తులతో కలిసి టీ తాగుతూ ముచ్చటిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో ఆయన రక్తపుమడుగులో అచేతనంగా పడిపోయారు. క్రాస్‌ఫైర్ సమయంలో మరణించిన మూడో షూటర్‌ను నవీన్ సింగ్ షెకావత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో గోగమేది బాడీగార్డ్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, ఈ హత్య తమ పనేనని గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా ప్రకటించాడు. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అధికార మార్పడి జరగాల్సి ఉన్న తరుణంలో కర్ణిసేన చీఫ్ దారుణహత్యకు గురికావడం తీవ్ర సంచలనమైంది. కాగా, తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు పోలీసుల కోసం రాజస్థాన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించనున్నారు.


Tags

Read MoreRead Less
Next Story