Vijay: నటుడు విజయ్‌కు మరోసారి సీబీఐ సమన్లు

తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరోసారి సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సోమవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు విజయ్ ఈ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.
2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన రాజకీయ ప్రచార కార్యక్రమంలో భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో దర్యాప్తు బాధ్యతను సీబీఐ చేపట్టింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని కమిటీ ఈ విచారణను పర్యవేక్షిస్తోంది.
ఈ కేసులో భాగంగా సీబీఐ ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున, సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా కార్యదర్శి మదియళగన్ వంటి పలువురు ముఖ్య నేతలను విచారించింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా విజయ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే ఈ నెల 12న విజయ్ తొలిసారి ఢిల్లీలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆ రోజు అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. కరూర్ సభ ఏర్పాట్లు ఎవరు చేశారు, భద్రతా చర్యలపై ముందస్తు సమాచారం ఉందా, సభాస్థలికి ఎందుకు ఆలస్యంగా వచ్చారు వంటి కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. పొంగల్ పండుగ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసి, రెండో దశ విచారణకు పిలిచారు. ఈ ఘటనలో బాధ్యులను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థ వేగం పెంచింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

