KEJRIWAL: మోదీ పేరు ఎత్తితే భోజనం పెట్టొద్దు

KEJRIWAL: మోదీ పేరు ఎత్తితే భోజనం పెట్టొద్దు
మహిళా ఓటర్లకు కేజ్రీవాల్‌ విజ్ఞప్తి... మోదీ జపం చేస్తున్న పురుషులను కంట్రోల్‌ చేయాలని సూచన

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మోదీ పేరు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భర్తలు మోదీ పేరు తలిస్తే వారికి రాత్రి పూట భోజనం పెట్టొద్దని భార్యలకు సూచించారు. ఢిల్లీలో చాలా మంది పురుషులు మోదీ జ‌పం చేస్తున్నార‌ని, అలాంటి వారికి అన్నం పెట్టొద్దని కేజ్రీవాల్ మ‌హిళా ఓట‌ర్లను కోరారు. ఢిల్లీలో నిర్వహించిన మ‌హిళా స‌మ్మన్ స‌మ‌రోహ్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో మోదీ జ‌పం చేస్తున్న పురుషుల‌ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వారి భార్యల‌పైనే ఉంద‌ని కేజ్రీవాల్‌ అన్నారు. అవ‌స‌ర‌మైతే మీ భ‌ర్తల‌కు రాత్రి వేళ డిన్నర్ క్యాన్సిల్ చేయండ‌ని సూచించారు. 2024-25 బ‌డ్జెట్‌లో మ‌హిళల‌కు కొత్త స్కీంను ప్రవేశ‌పెట్టామ‌ని తెలిపారు.


మహిళలకు కరెంటు, నీరు, విద్య, వైద్యం, బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి అనేక సౌకర్యాలు ఇస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు మీ భర్తలు, సోదరులు, తండ్రులు సహా మీ కుటుంబంలోని వారితో కేజ్రీవాల్‌కు ఓటేస్తామని ప్రతిజ్ఞ చేయించాలని మహిళలను అరవింద్ కేజ్రీవాల్ కోరారు. మీ ప్రయోజనాల కోసం పని చేసే వ్యక్తికి ఓటు వేయమని ఒప్పించడం మీ బాధ్యత అని అన్నారు. అంతేకాదు ఒకవేళ మీ భర్త మోదీ పేరు తలిస్తే అవసరమైతే రాత్రి వారికి ఫుడ్ కట్ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ రెండూ ఢిల్లీలో తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఢిల్లీలో 7 సీట్ల కోసం ఈ పోరు కొనసాగుతోంది.

18 ఏళ్లు నిండిన ప్ర‌తి యువ‌తికి, మ‌హిళ‌కు నెల‌కు రూ. 1000 చొప్పున ఇస్తున్నామ‌ని చెప్పారు. ఉచిత క‌రెంట్ ఇస్తున్నాం. బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించాం. వీటితో పాటు ఇప్పుడు నెల‌కు రూ. 1000 ఇవ్వ‌బోతున్నాం. మ‌రి మీకు బీజేపీ ఏం చేసింది..? అస‌లు బీజేపీకి ఎందుకు ఓటేయాలి..? ఈ సారి కూడా కేజ్రీవాల్‌కు ఓటేయాలి. ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు మీ అన్న కేజ్రీవాల్ అండ‌గా ఉంటారు త‌ప్ప‌.. ఇత‌రులు ఎవ‌రూ ఉండ‌ర‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్‌కు ఓటేస్తామ‌ని ప్ర‌తి మ‌హిళ త‌మ ఇంట్లో ప్రతిజ్ఞ చేయించాలి. అంతేకాకుండా ఆప్ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న కోరారు. మహిళలకు వెయ్యి రూపాయలు ఇచ్చే పథకం మహిళలను నాశనం చేస్తుందని బీజేపీ(BJP) అంటుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ప్రతి మహిళకు రూ.1000 ఇస్తూ డబ్బును వృథా చేస్తున్నారని అంటున్నారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే బీజేపీ ప్రభుత్వం అనేక మందికి భారీ రుణాలను మాఫీ చేసి ప్రజల సొమ్మును వృథా చేయడం తప్పు కాదా అని సీఎం ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story