Kerala : కేరళలో దారుణం.. వెంట వెంటనే ఐదు మర్డర్ లు

Kerala : కేరళలో దారుణం.. వెంట వెంటనే ఐదు మర్డర్ లు
X
బిర్యాని తినిపించి తమ్ముడిని, కత్తితో దాడి చేసి ప్రేయసి, అమ్మమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్నల హత్య!

కేరళ రాజధాని తిరువనంతపురంలో భయానక ఘటన జరిగింది. 23 ఏళ్ల యువకుడు తన సోదరుడు, పెదనాన్న, పెద్దమ్మ, ప్రేయసి సహా ఐదుగురిని హతమార్చాడు. నిందితుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన అతడి తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హత్యల అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. అయితే అప్పటికే ఎలుకల మందు తాగేయడం వల్ల అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని పోలీసులు వెంటనే తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

పెరుమలైలోని తన తల్లి షమీపై నిందితుడు అఫాన్ తొలుత దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను కట్టేసి ఆమె చెవిపోగులకు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత 22 కిలోమీటర్లు ప్రయాణించి పాంగోడ్​కు చేరుకున్నాడు. అక్కడ తన అమ్మమ్మను చంపేశాడు. ఆపై పాంగోడ్​కు 10కి.మీ దూరంలో ఉన్న తన పెదనాన్న ఇంటికెళ్లాడు నిందితుడు. అక్కడ పెదనాన్న లతీఫ్ , అతని భార్య షాహిదాను హత్యచేశాడు. అంతటితో ఆగకుండా పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తన సోదరుడు అఫ్సాన్​కు మండి బిర్యాని తీసుకొచ్చి ఇచ్చాడు. తిన్న తర్వాత అఫ్సాన్​, ప్రేయసి ఫర్జానాను సుత్తితో కొట్టి చంపాడు. సోమవారం సాయంత్రం 6 గంటలకు స్నానం చేసి, బట్టలు మార్చుకుని ఆటోలో వెంజరమూడు పోలీస్ స్టేషన్​కు వెళ్లాడు. పోలీసుల ఎదుట తాను హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. అయితే నిందితుడు పోలీస్ స్టేషన్​కు వచ్చే ముందు ఎలుకల మందు తాగేశాడు. వెంటనే అతడ్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

మొదట్లో అఫాన్ మాటలను పోలీసులు నమ్మలేదు. అప్పుడు పోలీసు బృందం పెరుమలైలోని అఫాన్ ఇంటికి చేరుకునే అక్కడి పరిస్థితి చూసేసరికి షాక్ అయ్యారు. వెంటనే గాయాలతో ఉన్న నిందితుడి తల్లిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితుడు హత్య చేసిన మూడు చోట్లకు వెళ్లి 5 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

"నిందితుడు చికిత్సకు సహకరించడం లేదు. అయితే అతడికి ప్రాణాపాయం లేదు. హత్యలకు కారణం ఆర్థిక కష్టాలేనని నిందితుడు తెలిపాడు. అతడికి చికిత్స పూర్తైన తర్వాత వివరణాత్మక వాంగ్మూలం తీసుకుంటాం. అఫాన్ తండ్రి రహీమ్ వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాత హత్యలకు గల స్పష్టమైన కారణాలు తెలుస్తాయి. నిందితుడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడనడానికి ఆధారాలు ఉన్నాయి. హత్యలు చేయడానికి అతను తన బైక్‌పై ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి ప్రయాణించాడు." అని పోలీసులు తెలిపారు.

మరోవైపు, నిందితుడు తమతో బాగా మాట్లాడేవాడని, సౌమ్యుడని స్థానికులు, బంధువులు తెలిపారు. అఫాన్ ఇన్ని హత్యలు చేశాడంటే నమ్మలేకపోతున్నామని చెప్పారు. తన సోదరుడు అంటే అఫాన్​కు చాలా ఇష్టమని, అతడ్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడని చెబుతున్నారు.

Tags

Next Story