Kerala: ‘జమిలి’ని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం

లోక్‌సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకే సమయంలో (జమిలి) ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కేరళ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రతిపాదిత విధానం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఇది దేశ సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, భారత ప్రజాస్వామ్యంలోని వైవిధ్య స్వభావాన్ని విధ్వంసం చేస్తుందని ఈ తీర్మానం ఆక్షేపించింది. విపక్ష యూడీఎఫ్ ఎమ్మెల్యేలు సూచించిన కొన్ని సవరణలను కూడా చేర్చడంతో తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రణాళికను రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ... కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తరఫున ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన అప్రజాస్వామికమని కేరళ అసెంబ్లీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ప్రతిపాదన దేశంలోని సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా దేశంలోని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వైవిధ్యాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఖర్చులను తగ్గించడానికి, సులభతరమైన పాలనను నిర్ధారించడానికి ఇతర సులభ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రధానమైన సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం, ప్రజల హక్కులను సవాల్ చేయడం, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక స్వపరిపాలన హక్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com