Kerala: డాక్టర్ల భద్రతపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం
పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తో వైద్యుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపడుతున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం వైద్యకళాశాలలకు కీలక ఆదేశాలు జారీచేసింది. స్పేస్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. తద్వారా మెడికల్ కాలేజీల నిర్వహణ ఏమేరకు ఉందోనని పరిశీలిస్తారు.
స్పేస్ ఆడిట్ నిర్వహించాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు మరికొన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించింది. మాక్‌డ్రిల్స్ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాకీటాకీల వినియోగం, అనుమతి లేనివారికి రాత్రివేళ ఆస్పత్రిలో ఉండేందుకు నిరాకరించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇవేకాకుండా రాత్రిపూట డ్యూటీ ముగించుకొని వెళ్లే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వీధి కుక్కల దాడుల నుంచి సిబ్బంది, విజిటర్స్‌ను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం సాయంతో తగిన ప్రణాళికలు అమలు చేయాలని ఆమె ఆదేశించారు. అన్ని వైద్య కళాశాలలు ‘కోడ్ గ్రే’ ప్రొటోకాల్‌ను అమలు చేయాలని పేర్కొన్నారు. రోగి సహా ఎవరైనా దూకుడుగా, దుర్భాషలాడుతున్నప్పుడు, హింసాత్మకంగా లేదా బెదిరింపు ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు దీనిని అమలు చేస్తారు. డ్యూటీ రూమ్స్, ఎగ్జామినేషన్ రూమ్స్, రెస్ట్ రూమ్స్‌ను కూడా తనిఖీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
పశ్చిమబెంగాల్ హత్యాచార ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో కొందరు దుండగులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దానిని కేంద్ర ఆరోగ్యశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది భద్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చింది. ఆసుపత్రి ప్రాంగణం లేక సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగిన ఆరు గంటల్లోపు పోలీసులు కేసు పెట్టాలని చెప్పింది. నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆసుపత్రి హెడ్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com