ఎవరూ కొనని లాటరీ టికెట్.. ఏజెంట్ లక్కు మార్చింది..

ఒక్కోసారి అంతే.. అదృష్టం అలా పలకరిస్తుంది. లాటరీ టికెట్లు అమ్ముకోవడమే అతని జీవనాధారం. ఎప్పుడూ తానొకటి ఉంచుకుందామనుకోలేదు.. అన్నీ అమ్ముడుపోవాలనే ఆశించేవాడు.. తన దగ్గర టికెట్ కొన్నవాళ్లకి లాటరీ తగిలితే అదే పదివేలనుకుని సంబర పడేవాడు.. అతడి మంచితనమే ఇప్పుడు తనను అదృష్టదేవత వరించేలా చేసింది.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఎన్‌కే గంగాధరన్ నాలుగు సంవత్సరాల క్రితం లాటరీ దుకాణాన్ని తెరిచాడు. అంతకు ముందు దాదాపు 33 ఏళ్లు గంగాధరన్ బస్ కండక్టర్‌గా పనిచేశాడు. అథోలి గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో గంగాధరన్ దేవికా స్టోర్ లో లాటరీ టికెట్లు విక్రయించే వ్యాపారం ప్రారంభించాడు.
రోజు మాదిరిగానే ఆ రోజు కూడా లాటరీ టికెట్లు విక్రయించాడు. అన్నీ అమ్ముడు పోయాయి కానీ ఒక్క టికెట్ మాత్రం మిగిలిపోయింది. సరే అని అలానే తన దగ్గర ఉంచుకున్నాడు గంగాధరన్ ఆ టికెట్ ను.
ఇంతలో లాటరీ ఫలితాలు రానే వచ్చాయి. ఏ టికెట్ అయితే అమ్ముడు పోలేదో దానికే కోటి రూపాయల బహుమతి వచ్చింది. ఏజెంటే స్వయంగా లాటరీ గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లాటరీలో మొదటి బహుమతి పొందినందుకు అతడిని కోటి రూపాయల విజేతగా ప్రకటించారు. ఆ వ్యక్తి తన వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురితో పాటు ఈ బహుమతిని గెలుచుకున్నాడు. అతను అద్భుతమైన మొత్తాన్ని గెలుచుకోగా, అదే డ్రాలో అతని దుకాణం నుండి ఇతర టిక్కెట్లు ఒక్కొక్కటి రూ. 5,000 గెలుచుకున్నాయి.
ఈ అక్టోబర్ ప్రారంభంలో లాటరీ విజేతలను ప్రకటించగా, గంగాధరన్ అధికారుల నుండి సంతోషకరమైన వార్తను అందుకున్నాడు. ఒక్క క్షణం అంతా గందరగోళంగా అనిపించింది. ఇది నిజమా అని తనను తానే నమ్మలేకపోయాడు. అవసరమైన విధానాలను స్పష్టం చేయడానికి అతను తన బ్యాంకును సంప్రదించే వరకు తన విజయాన్ని రహస్యంగా ఉంచాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com