Wayanad Tiger: 'ఆ మ్యాన్ ఈటర్‌ను చంపేయండి' - కేరళ ప్రభుత్వం

కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించింది. కనిపిస్తే దానిని కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇటీవల వయనాడ్ జిల్లాలో ఓ పులి మహిళపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన కేరళలో సంచలనం రేపింది. దీనిపై స్థానికంగానూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనితో కేరళ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళపై దాడి చేసిన పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించిన ప్రభుత్వం, అది కంటపడితే చంపేయాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీంద్రన్ ఈ ప్రకటన చేశారు.
వయనాడ్‌లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళలపై ఇటీవల ఓ పెద్దపులి దాడి చేసింది. అనంతరం ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసినట్లు సమాచారం. అంతేకాదు ఆ పులి అటవీశాఖ అధికారి జయసూర్యపైనా దాడి చేసింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. దీనితో వారు ఆందోళనకు దిగారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి సూచన మేరకు అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయ నిపుణుల సలహా అనంతరం ఆ పెద్దపులిని చంపేయాలని నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి శశీంద్రన్ వెల్లడించారు. అయితే, ఓ పులిని మ్యాన్‌ఈటర్‌గా ప్రకటించడం కేరళ రాష్ట్రంలో ఇదే తొలిసారని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com