Nimisha Priya : నిమిష ప్రియకు భారీ ఊరట.. ఉరిశిక్ష రద్దు చేసిన యెమెన్!

నిన్నటి వరకు దేశ వ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠ. పరాయి దేశంలో భారతీయ నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష రద్దవుతుందా లేదా? అని.. రద్దు అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. మొత్తానికి ప్రభుత్వ కృషి, ప్రజల ప్రార్థనలతో నిమిషా ప్రియకు మరణ శిక్ష తప్పింది. యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేశారు. దీనికి సంబంధించి గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక లిఖిత పూర్వక ధృవీకరణ రాలేదని కూడా ప్రకటనలో స్పష్టం చేశారు. గతంలో సస్పెండ్ చేయబడిన నిమిషా ప్రియ మరణశిక్షను ఇప్పుడు పూర్తిగా రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొంది.
యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం తెలిపిందని వార్తా సంస్థ ANI తెలిపింది .నిమిషా ప్రియ కేసు 2018 నుంచి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిమిషా తన వ్యాపార భాగస్వామిని హత్య చేసి, ఆపై శరీరాన్ని ముక్కలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె మార్చి 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించింది కోర్టు. 2020లో యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది.
కేరళకు చెందిన 34 ఏళ్ల నర్సు నిమిషా ప్రియ పాలక్కాడ్ జిల్లాకు చెందినది. 2008లో, నిమిషా ఉద్యోగం కోసం యెమెన్‌కు వెళ్లింది. ఆమె ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినది. యెమెన్ రాజధాని సనాలో, ఆమె స్థానిక పౌరుడు తలాల్ అబ్దో మహదీని కలిసింది. అతనితో కలిసి ఒక క్లినిక్ ప్రారంభించింది. కొంతకాలం తర్వాత, వారి మధ్య పొరపొచ్చాలు తలెత్తాయి.
మీడియా నివేదికల ప్రకారం, మెహది నిమిషాను వేధించడం ప్రారంభించాడు, బహిరంగంగా తనను తాను ఆమె భర్త అని చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇది మాత్రమే కాదు, నిమిషా భారతదేశానికి తిరిగి రాకుండా ఉండటానికి అతను ఆమె పాస్‌పోర్ట్‌ను కూడా లాక్కున్నాడు.
యెమెన్ అధికారుల ప్రకారం, నిమిషా 2017 లో తన పాస్‌పోర్ట్‌ను తిరిగి తీసుకోవడానికి మహదీని సృహ కోల్పోయేలా చేయాలని ప్రయత్నించిందని, కానీ ఆ ప్రయత్నం ప్రాణాంతకంగా మారిందని, అధిక మోతాదు కారణంగా మహదీ మరణించాడని తేలింది. దీని తరువాత, యెమెన్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. 2018లో, ఆమె ఈ హత్య కేసులో దోషిగా తేలింది. 2020లో, యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. మానవ హక్కుల సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఆమె శిక్షను రద్దు చేయాలని గొంతెత్తి నినదించారు. భారత ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపడం ప్రారంభించింది.
డిసెంబర్ 2024లో యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలీమి ఉరిశిక్షను ఆమోదించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. హౌతీ తిరుగుబాటు నాయకుడు మహదీ అల్-మషత్ కూడా జనవరి 2025లో దానిని ధృవీకరించారు. దీని తర్వాత, భారతదేశంలో మతపరమైన, దౌత్య స్థాయిలో ఆమెను రక్షించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఎట్టకేలకు గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం యెమెన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, నిమిషా మరణశిక్షను రద్దు చేసినట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com