POCSO Case: కూతురిపై లైంగిక దాడి .. దంపతులకు 180 ఏండ్ల జైలు, చెరో రూ.11.75 లక్షల జరిమానా

POCSO Case: కూతురిపై  లైంగిక దాడి .. దంపతులకు  180 ఏండ్ల జైలు,    చెరో రూ.11.75 లక్షల జరిమానా
X
కేరళలోని మంజేరిలోని పోక్సో కోర్ట్‌ సంచలన తీర్పు

కేరళలోని మంజేరిలోని ప్రత్యేక లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (POCSO) కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడినందుకు ఒక జంటకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో నిందితులైన మహిళ, ఆమె భర్త కలిసి దారుణానికి పాల్పడ్డారు. మొదటగా బాధితురాలి తల్లి తన భర్తను విడిచిపెట్టిన తర్వాత ఈ దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురంలో ఉన్నప్పుడు నిందితురాలు ఆమె భర్త(నిందితుడు)తో పరిచయం పెంచుకుని ఆ తర్వాత తన చిన్న కుమార్తెతో సహా అతనితో పారిపోయింది.

ఆ తర్వాత డిసెంబర్ 2019 – అక్టోబర్ 2021 మధ్య ఈ ముగ్గురూ పాలక్కాడ్, మలప్పురం జిల్లాల్లో అద్దె ఇళ్లలో నివసించారు. ఈ సమయంలోనే ఆ వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి (నిందితురాలు) కేవలం ప్రేక్షకురాలుగా ఉండటమే కాకుండా.. ఈ నేరాలకు సహకరించినట్లు నిర్ధారణ అయింది. ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన కుమార్తెకు బలవంతంగా మద్యం తాగించి, బెదిరింపులకు పాల్పడిందని.. అమ్మాయి మెదడులో చిప్ అమర్చారని, నువ్వు ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే తమకు తెలిసిపోతుందని ఆ బాలికను భయపెట్టినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది.

దీనితో కోర్టు ఇద్దరికి చెరో 180 ఏళ్ల జైలు శిక్షతో పాటు.. ఇద్దరు దోషులకు చెరో రూ.11.75 లక్షల జరిమానా కూడా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించడంలో విఫలమైతే వారి జైలు శిక్షకు మరో 20 నెలలు చేరుతుందని వెల్లడించింది. కోర్టు ఈ శిక్షను పేర్కొంటూ.. POCSO చట్టంలోని వివిధ నేరాలకు గాను నిందితులు ఏకకాలంలో అనేక 40 ఏళ్ల శిక్షలను అనుభవించాలని ఆదేశించింది. దీని ద్వారా మొత్తం శిక్ష 180 సంవత్సరాలుగా మారింది. బాధితురాలికి మద్దతుగా, నిందితుల నుంచి వసూలు చేసిన జరిమానాలను ఆ బాలికకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రభుత్వ సర్వైవర్ అసిస్టెన్స్ స్కీమ్ కింద ఆమెకు అదనపు ఆర్థిక సహాయం అందించాలని జిల్లా న్యాయ సేవల అథారిటీని ఆదేశించింది.

Tags

Next Story