Brain Eating Amoeba : మెదడును తినే అమీబాతో కేరళలో ఐదవ మృతి

కేరళలో అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ తీవ్ర కలకలం రేపుతోంది.‘అమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్’ అనే ఈ వ్యాధి కారణంగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. కలుషిత నీటిలో ఉండే అమీబా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
మలప్పురం జిల్లా వండూర్‌కు చెందిన శోభన (56) అనే మహిళ ఈ వ్యాధితో చికిత్స పొందుతూ కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తాజాగా మరణించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. సరిగ్గా రెండు రోజుల క్రితమే సుల్తాన్ బతేరికి చెందిన రతీష్ (45) అనే వ్యక్తి కూడా ఇదే ఆసుపత్రిలో ఇదే వ్యాధితో మృతి చెందారు. అతనికి గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆగస్టులో ముగ్గురు ఈ వ్యాధికి బలవగా, తాజా మరణాలతో కలిపి కేవలం నెల రోజుల్లో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రస్తుతం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరో 11 మంది ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలతో చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42 కేసులు నమోదైనట్టు వారు ధ్రువీకరించారు.
కలుషితమైన నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం వల్ల ఈ అరుదైన ఇన్ఫెక్షన్ సోకుతుందని ఆరోగ్య శాఖ అధికారులు వివరిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వ్యాధి చికిత్సకు సంబంధించి వైద్యులకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రజలు కలుషిత నీటి వనరులకు దూరంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com