Wayanad Landslides : వాయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం

Wayanad Landslides : వాయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం
X
కొండచరియలు విరిగిపడిన విషాదంలో 123కి చేరిన మృతులు

కేరళలోని వయనాడ్‌లో సంభవించిన అత్యంత విషాదకరమైన కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 123కి చేరుకుంది. మరో 128 మంది గాయపడ్డారు. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. వయనాడ్‌లో కుండపోత వర్షాల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.

అర్ధరాత్రి వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీయడమే లక్ష్యంగా రెస్క్యూలో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత వేగంగా పని చేస్తున్నారని చెప్పారు.

కాగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది రోదిస్తూ కనిపిస్తున్నారు. ఎటూ చూసిన హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. అటు ఇటు తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపు చూసినవారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇక ఇళ్లలో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఆ ఇళ్లలోంచి ఫోన్లు చేస్తున్నారు.ముండక్కై, చూరల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాలలో ఈ తరహా దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కాగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మొదటిసారి కొండచరియలు విరిగిపడగా.. 4.10 గంటలకు మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామాలకు గ్రామాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి.

Tags

Next Story