Cyber crime : ఏఐని ఉపయోగించి రూ. 40 వేలు కొట్టేసారు

మనం అభివృద్ధి దిశగా ఎంతగా పరిగెడుతున్నామో తప్పులు చేసే వాళ్ళు అందులో కొత్తదనం, టెక్నాలజీ సహాయం కోసం కూడా అంతే ప్రయత్నిస్తున్నారు. రాను రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లో భాగమైంది. ఈ కృత్రిమ మేధ ప్రయోజనాల సంగతి పక్కనపెడితే న్యూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న కేటుగాళ్లు దానిని తమ అవసరం కోసం వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పలు రకాల స్కామ్‌లు, స్కీమ్‌లతో, డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చి ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. కేరళకు చెందిన ఓ వ్యక్తిని ఏఐ ఆధారిత డీప్‌ఫేకింగ్ టెక్నాలజీతో నిందితులు రూ. 40,000 కొట్టేసారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళ కోజికోడ్‌కు చెందిన రాధాకృష్ణన్‌కు గుర్తుతెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో తన ఇమేజ్ ఆధారంగా అతడు తన పాత స్నేహితుడు అనుకొన్నాడు.. మాటల్లో తమ కామన్ ఫ్రెండ్స్ పేర్లను కూడా ప్రస్తావించడంతో ఇంకాసేపు మాటలు కంటిన్యూ చేసాడు..
కొద్దిసేపు మాట్లాడిన తరువాత తాను దుబాయ్ లో ఉన్నానని, తమ బంధువు ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పిన నిందితుడు ఓ రూ. 40,000 ఉంటే సర్దమని కోరాడు. మన దోస్తే కదా సాయం చేయాలని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పంపాడు. తరువాత అదే వ్యక్తి రూ. 35,000 పంపాలని కోరడంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణన్ తన మరో ఫ్రెండ్ సంప్రదించాడు. ఆపై తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు
ఈ సంఘటన తరువాత డీప్ ఫేక్ గురించి మరోసారి చర్చ మొదలయ్యింది. ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ నేరమే ఇది. ఈ నయా త రహా సైబర్ నేరాలు పాల్పడేందుకు నేరగాళ్ళకు అవసరమైన డేటా డార్క్ వెబ్‌తో పాటు సోషల్ మీడియాలో తేలిగ్గా లభిస్తోంది.సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, ఆడియో, వీడియోల కొట్టేసే ఈ–కేటుగాళ్ళు వాటిని సేకరిస్తున్నారు. డార్క్ వెబ్ సహా ఇంటర్‌నెట్ నుంచి కొన్న టూల్స్ యూస్ చేసి సింథసిస్ ప్రక్రియ చేయడుతున్నారు. అయితే ఇది కేవలం నేరగాళ్ళు మాత్రమే కాదు, సాంకేతికతపై పట్టున్న వాళ్లు కూడా చేస్తున్న వ్యవహారం కావడం ఆందోళన కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com