Kerala: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ శ్రీలేఖ

కేరళలో అసెంబ్లీ ఎన్నికల గడువు మరో ఏడాదిన్నర మిగిలి ఉండగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. పార్టీల్లో చేరికల పర్వాలు కొనసాగుతున్నాయి. కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి, మాజీ డీజీపీ శ్రీలేఖ బీజేపీలో చేరారు. బుధవారం తిరువనంతపురంలోని ఆమె నివాసంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు కే సురేంద్ర సమక్షంలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అధికారికంగా బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. శ్రీలేఖ.. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. రాష్ట్ర కేడర్‌లో మొదటి మహిళా ఐపీఎస్. ఇక 2020లో కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.
బీజేపీలో చేరిన అనంతరం శ్రీలేఖ మీడియాతో మాట్లాడారు… 33 ఏళ్లు పార్టీలకతీతంగా ఐపీఎస్ అధికారిగా పనిచేసినట్లు తెలిపారు. పదవీ విరమణ తర్వాత చాలా సమస్యలను దూరం నుంచి చూడటం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజాసేవ చేయడానికి ఇదే అత్యుత్తమ మార్గమని తనకు అర్థమైందన్నారు. బీజేపీ పార్టీ ఆదర్శాలపై తనకు నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘శ్రీలేఖ రాష్ట్ర ప్రజలకు చాలా సుపరిచితురాలు. ఆమె పోలీసు శాఖలో అనేక సంస్కరణలకు నాయకత్వం వహించిన ధైర్య అధికారి. మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఆమె అనేక నిర్ణయాలు తీసుకుని పోలీసుశాఖలో మహిళల పాత్రను సుస్థిరం చేశారు. ఆమె సుప్రసిద్ధ రచయిత్రి కూడా. ఆమె అనుభవం మరియు ఆమె నాయకత్వం బీజేపీకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.’’ అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com