Onam: మళయాళీల పెద్ద పండుగ ఓనం

కేరళ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహభరితంగా జరుపుకొనే పండగ ఓనం. మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళ వాసులు ఓనం పండగని సంబరాల మధ్య జరుపుకుంటారు. కేరళ ఘనమైన సంస్కృతి సంప్రదాయాలకు వారసత్వంగా ఈ పండగను పది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పండగ విశేషాలు తెలుసుకోవడానికి విదేశీయులు సైతం కేరళ వస్తుంటారు. ఇక్కడ నృత్యాలు, విందు భోజనాలు, పులి వేషాలు, ప్రాచీన విద్యలు - ఆటలు మరియు పడవ పందేలు కన్నుల పండగ గా జరుగుతాయి.పాతాళం లోకి వామనుడి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తిని బలిచక్రవర్తి ఓ కోరిక కోరిన నేపధ్యంలో ప్రతి ఏడాది తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిస్తాడు.మహాబలి చక్రవర్తి ఓనం రోజున తన ప్రజలను కలుసుకొనేందుకు ఆత్మరూపంలో వస్తాడని కేరళీయుల నమ్మకం. అందుకనే అతడిని తమ ఇళ్ళలో ఆహ్వానించడానికే ఈ పండగను జరుపుకుంటారు.
ఆతం పేరుతో తొలిరోజు ప్రారంభమయ్యే ఉత్సవాలు పదో రోజున తిరు ఓనంతో ఘనంగా ముగుస్తాయి. పదిరోజుల పాటు భారీగా జరిగే ఈ సంబరాలు మలయాళీల ఆచారాలను, కళలను ప్రతిబింబిస్తాయి. కొత్త దుస్తులు, సాంప్రదాయ వంటలు, నృత్యము మరియు సంగీతములతో పాటు రాష్ట్రమంతటా పాటించే ఆచారం. ఓనంను వ్యవసాయ పండుగగా వ్యవహరిస్తారు.సంప్రదాయ పడవ పందాలు, అలాగే బాల్ ఆటలు, విలువిద్యా పోటీలు, కబడ్డీ , కత్తి యుద్దాలు వంటి ఇతర క్రీడా పోటీల్లో యువకులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు.
ఇక మహాబలి ని ఆహ్వానిస్తూ, ఇంటి ముందర పేడ నీళ్ళు చల్లి రంగురంగుల పూలతో అందంగా రంగవల్లులను తీర్చి దిద్దుతారు. వీటిని పూగళమ్ అంటారు. సంప్రదాయ బంగారు రంగు అంచు కలిగిన తెల్లని చీరను ధరించి మహిళలు పూల రంగవల్లుల మధ్య దీపాలను ఉంచి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడి మైమరిచిపోతారు. కైకొట్టి కలై, తుంబి తుల్లల్ నృత్యాలతో సందడి చేస్తారు.చిన్న, పెద్ద అనే వయోభేదం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహ భరితంగా పాల్గొంటూ పండగ సంరంభంలో మమేకవుతుంటారు. మలయాళీలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పటికీ భక్తిశ్రద్ధలతో ఓనం పండగను పాటిస్తారు.
మరోవైపు కళా ప్రదర్శనలు ఎన్ని ఉన్నా కథకళి నృత్యానికే అగ్ర తాంబూలం. రామాయణ, మహాభారతాల్లోని కొన్ని ఘట్టాలను విధిగా ప్రదర్శిస్తారు. పురాణాలు, చరిత్రపై పిల్లల్లో తగిన అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో దోహద పడతాయని మలయాళీల విశ్వాసం. మరోవైపు స్నేక్ బోట్ రేస్ కేరళ లో ప్రధాన ఆకర్షణ. సుమారు వంద అడుగుల పొడవు ఉండే పడవల్లో దాదాపు 150 మంది యువకులు కూర్చుని ఉత్సాహ భరితంగా పోటీలో పాల్గొంటారు. సుమారు 40 కిలోమీటర్ల వరకూ ఈ పడవలు దూసుకు పోతుంటాయి. పాములా మెలికలు తిరిగే ఈ పడవలు నీటిపై జోరుగా సాగుతుంటే వేలాదిమంది జనం ఉత్కంఠతో చూస్తుంటారు.
ఇక శాస్త్రీయ వాయిద్యపరికరాలను వాయిస్తుండగా,పులి వేషాలు ధరించిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ కనిపించడం ఓనం పండగలో ఆకర్షణ. దీనిని కేరళీయులు పులిక్కలి అంటారు.ఓనం పండగ లో చివరి రోజున తిరు ఓనం సందర్భంగా పచ్చని ఆకులో 20 రకాల వంటకాలతో, పాలు మరియు చక్కెరతో చేసిన పాయాసంతో ఓన సధ్య ను సామూహికంగా స్వీకరిస్తారు.
కేరళలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఈ పండగను జరుపుకోవడంతో ఓనంకి ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఓనం హిందు పండగ అయినా, హిందువులు, ముస్లిములు మరియు క్రైస్తవులు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com