సివిల్ సర్వీసులపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

సివిల్ సర్వీసులపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మిషన్ కర్మయోగి పేరిట సివిల్ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.సివిల్ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. పౌర అధికారులను మరింత సృజనశీలురుగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా ఉండేలా దేశ భవిష్యత్ కోసం వారిని దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్ కర్మయోగిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో అధికార భాషలపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఉర్దూ, ఇంగ్లీషుతో పాటు కశ్మీరీ, డోగ్రి, హిందీ భాషలను అధికార భాషలుగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లుపై పార్లమెంటులో త్వరలోనే చర్చ జరగనుంది.
జపాన్ మార్కెట్ కోసం భారతీయ వస్త్రాలు, దుస్తుల నాణ్యతను మెరుగుపరచడం, పరీక్షించడం కోసం భారతదేశానికి చెందిన వస్త్రాల కమిటీ, జపాన్ కు చెందిన నిస్సెన్కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సాంకేతిక వస్త్రాలతో సహా ఇతర వస్త్రాలు, దుస్తుల ఉత్పత్తులు, దేశవిదేశాలలోని ఖాతాదారులు,కొనుగోలుదారులతో పరస్పరం ఆమోదయోగ్యమైన ఇతర ఉత్పత్తులను తమ తరఫున భారతదేశంలో పరీక్ష, తనిఖీ సేవలు నిర్వహించడంలో సహకరించడానికి వీలుగా వస్త్రాల కమిటీని నియమించుకోడానికి జపాన్ కు చెందిన నిస్సెన్కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్ కు ఈ అవగాహనా ఒప్పందం అనుమతిస్తుంది. జపాన్, ఫిన్‌లాండ్, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com