Khalistani terrorist: రిపబ్లిక్‌ డే రోజున పంజాబ్‌ సీఎంను చంపేస్తాం

Khalistani terrorist: రిపబ్లిక్‌ డే రోజున పంజాబ్‌ సీఎంను చంపేస్తాం
ఖలిస్థాన్‌ తీవ్రవాది పన్నూన్‌ బెదిరింపులు

ఖలిస్థాన్‌ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ తాజాగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ను చంపేస్తామని హెచ్చరించాడు. జనవరి 26వ తేదీన భగవంత్‌ మాన్‌ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. గ్యాంగ్‌స్టర్‌లు అంతా ఏకమై రిపబ్లిక్‌ డే రోజున పంజాబ్‌ సీఎంను చంపేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చాడు.

పంజాబ్‌లో గ్యాంగ్‌స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బెదిరింపులకు కారణంగా తెలుస్తోంది. ఈ బెదిరింపులపై పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ స్పందించారు. గ్యాంగ్‌స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్‌ విధానాన్ని అవలంభిస్తోందని తెలిపారు. పన్నూన్‌ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా, పన్నూన్‌ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఇదేమీ మొదటి సారి కాదు. గత కొన్ని రోజులుగా భారత్‌కు చెందిన పలువురు నేతలుచంపేస్తామంటూ, ప్రముఖ ఆలయాలు, ఎయిర్‌పోర్ట్‌లను ధ్వంసం చేస్తామంటూ బెదిరింపులు చేశాడు. గత నెలలో కూడా పార్లమెంట్‌ భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఇప్పుడు తాజాగా పంజాబ్‌ సీఎంను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.

ఖలిస్థాన్ అంటే పరిశుద్ధ భూమి అని అర్థం. మన దేశంలోని పంజాబ్‌లో సిక్కులు ఎక్కువగా ఉంటారనే సంగతి తెలిసిందే. మతం ఆధారంగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌తో ఖలిస్థాన్ ఉద్యమం మొదలైంది. బ్రిటిషర్ల పాలన కాలంలోనే ఖలిస్థాన్ అనే ఆలోచన మొగ్గతొడిగింది. భారత్, పాకిస్థాన్‌లలోని పంజాబ్ ప్రాంతంతో ఖలిస్థాన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ దేశ విభజన సమయంలో తెర మీదకు వచ్చింది.

పంజాబ్‌లో సిక్కు మతం 15వ శతాబ్దం చివరిలో వ్యాప్తిలోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్ల మంది ఈ మతాన్ని అనుసరిస్తున్నారు. పంజాబ్‌లో జనాభా పరంగా సిక్కులే ఎక్కువ. కానీ మన దేశంలో సిక్కుల జనాభా 2 శాతం మాత్రమే. పంజాబ్‌ను ‘ఖలిస్థాన్’ పేరిట ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనేది సిక్కు వేర్పాటువాదుల డిమాండ్.

ఖలిస్థాన్ డిమాండ్ అనేకసార్లు తెరమీదకు వచ్చింది. 1970, 1980ల్లో ఈ వేర్పాటువాదంతో దశాబ్దంపాటు పంజాబ్ తీవ్రంగా ప్రభావితమైంది. 1982లో సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నేతృత్వంలోని వేర్పాటు వాదులు హింసకు పాల్పడ్డారు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సమాంతర పాలన సాగిస్తూ.. హిందువులపై, ప్రభుత్వ సంస్థలపై దాడులకు తెగబడ్డారు.

ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని దేశ భద్రతకు ముప్పుగా పరిగణించిన భారత ప్రభుత్వం.. 1984లో సైన్యాన్ని స్వర్ణ దేవాలయంలోకి పంపించింది. సైన్యం కాల్పుల్లో వందలాది మంది ఖలిస్థాన్ వేర్పాటువాదులు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా 1984 అక్టోబర్‌ 31న నాటి ప్రధాని ఇందిరా గాంధీని సిక్కులైన ఆమె బాడీగార్డులు దారుణంగా హతమార్చారు. 1985లో కెనడా నుంచి భారత్ వస్తోన్న ఎయిరిండియా బోయింగ్ విమానం బాంబు పేలుడు కారణంగా ఐరిష్ తీరంలో కూలిపోయింది. 329 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనకు సిక్కు మిలిటెంట్లు కారణమనే ఆరోపణలున్నాయి. ఇందిరా గాంధీ హత్య అనంతరం 1986, 1988ల్లో రంగంలోకి దిగి ఆర్మీ.. సిక్కు మిలిటెంట్లను పంజాబ్ నుంచి ఏరివేసింది.

Tags

Next Story