Donald Trump: ఖమేనీని చంపడం మాకు పెద్ద విషయం కాదు-ట్రంప్

ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ఇప్పటికీ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందించడానికి తాను చర్యలు తీసుకోను, అమెరికా ఖమేనీని హత్య చేయగలదని, కానీ ప్రస్తుతానికి అలా చేయడం లేదని’’ అని అన్నారు. ‘‘షరతులు లేకుండా లొంగిపోండి’’ అంటూ గట్టి హెచ్చరిక చేశారు.
ఇలా చేయకపోవడానికి ఒకే ఒక్క కారణం అమెరికా పౌరులు, దళాలపై ప్రతీకార దాడులు నిరోధించడానికే అని అన్నారు. “‘సుప్రీం లీడర్’ అని పిలవబడే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతను సులభమైన లక్ష్యం, కానీ అక్కడ సురక్షితంగా ఉన్నాడు – మేము అతన్ని చంపబోము. ప్రస్తుతానికి అలా చేయము’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో అన్నారు. ‘‘మేము పౌరులపై లేదా అమెరికన్ సైనికులపై క్షిపణులు ప్రయోగించాలని మేము కోరుకోవడం లేదు. ఎంతో ఓపికతో ఉన్నాము’’ అని చెప్పారు.
జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ట్రంప్.. హుటాహుటిన అమెరికాకు తిరిగి వెళ్లిపోయారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు తార స్థాయికి చేరుకోవడంతో, అత్యవసర జాతీయ భద్రతా చర్చల కోసం వాషింగ్టన్కు తిరిగి వెళ్లారు. ఇరాన్ సైనిక, అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుసగా ఐదవ రోజు క్షిపణి దాడులు చేసింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ వైఖరి చర్చకు దారితీసింది. అంతేకాదు.. టెహ్రాన్ లో ఉంటున్న పౌరులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్రంప్ ఆదేశించడం సంచనలంగా మారింది. “ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు. నేను పదే పదే చెప్పాను. అందరూ వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలి” అని ట్రంప్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com