Mysore Lok Sabha constituency: ఆసక్తికరంగా మైసూర్‌ లోక్‌సభ నియోజకవర్గం

Mysore Lok Sabha constituency: ఆసక్తికరంగా మైసూర్‌ లోక్‌సభ నియోజకవర్గం
రాజా వర్సెస్‌ ప్రజా అంటున్న కాంగ్రెస్

మైసూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేయడానికి భాజపా, కాంగ్రెస్‌ చేస్తున్న యత్నాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో మైసూర్‌ రాజవంశానికి చెందిన రాజు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ పోటీ చేస్తుండటంతో ఈ పోరును "రాజా వర్సెస్‌ ప్రజా" గా కాంగ్రెస్‌ అభివర్ణిస్తోంది. రాజుతో పోటీ పడుతున్న సామాన్యుడిని గెలిపించాలంటూ ప్రజల మద్దతు కూడగట్టాలని చూస్తోంది. అటు.. రాజు వడియార్‌ కూడా ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్పష్టమైన కన్నడ మాట్లాడుతూ ప్రజల మెప్పు పొందుతున్నారు.

మైసూరు లోక్‌సభ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. శతాబ్ధాలు మైసూరు రాజ్యాన్ని ఏలిన రాజవంశ రాజు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌ భాజపా తరఫున ఒక వైపు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌తో పోటీ చేస్తూ సామాన్యుడిని అంటూ ప్రచారం చేసుకుంటున్న M లక్ష్మణ మరోవైపు నిలుచున్నారు. ఫలితంగా రాజా వర్సెస్‌ సామాన్యప్రజాగా మైసూర్‌ పోరుకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. వడియార్‌కు మద్దతుగా భాజపా విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహిస్తుండగా.. M లక్ష్మణకు దన్నుగా సీఎం సిద్ధరామయ్య ఉంటూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పార్టీలో, అలాగే నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు సిద్ధరామయ్యకు ఈఎన్నిక చాలా కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలా అయినా లక్షణను గెలిపించాలని పట్టుదలతో ఉన్న సిద్ధరామయ్య.. ఈ ప్రాంతంలో వీలైనన్ని ఎక్కువ పర్యటనలు, ప్రచార సమావేశాలను నిర్వహిస్తున్నారు. లక్ష్మణకు ఓటు వేస్తే తనకు వేసినట్లేనని, ఆయన గెలిస్తే తాను గెలిచినట్లేనని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

మైసూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వక్కలిగ సామాజికవర్గ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ అక్కడ ఆ వర్గానికి చెందిన లక్ష్మణనే అభ్యర్థిగా బరిలో నిలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలూ కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం సృష్టించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలకు రాజకుటుంబంపై సహజంగా ఉండే గౌరవ మర్యాదల దృష్ట్యా నేతలకు కాంగ్రెస్‌ కీలక సూచనలు చేసింది. నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా నేతలతో భేటీ అవుతున్న సిద్ధరామయ్య.. వడియార్‌పై అవమానకర లేదా పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని 'స్పష్టమైన ఆదేశాలు' ఇచ్చారు. లక్షణ, సిద్ధరామయ్యతో పాటు వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన మాస్‌ లీడర్‌ డీకే శివకుమార్‌ మైసూర్‌లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. సామాజిక వర్గ నాయకులతో సమావేశాలు నిర్వహించి మద్దతు కూడగడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story