Brahmos Missile: పాక్‌ ఉగ్రస్థావరాలను కూల్చివేసింది బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌తోనే

Brahmos Missile:  పాక్‌ ఉగ్రస్థావరాలను కూల్చివేసింది బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌తోనే
X
శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి

పాకిస్థాన్‌తో ఘర్షణ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో భారత్‌ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో...అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్థాన్‌ అధికారిక రాజధాని ఇస్లామాబాద్‌ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్‌ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్‌ ట్యాంకర్‌ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్‌ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్‌-11 బాలిస్టిక్‌ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్‌ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్‌ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రతిగా భారత్‌ శనివారం తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు, గైడెడ్‌ మ్యూనిషన్, లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ను వాడినట్లు తెలుస్తోంది. వీటిలో బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులు అత్యంత కీలక పాత్ర పోషించాయి. సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్‌ క్షిపణులు పాకిస్థాన్‌ భూభాగాల లోపలి వరకూ వెళ్లి ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయని వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలియజేస్తోంది. ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో...రఫీకీ, మురీద్, నూర్‌ఖాన్, రహీంయార్‌ ఖాన్, సుక్కుర్, చునియన్‌. పర్సూర్, సియాల్‌కోట్‌ ఉన్నాయి.

పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రఫికీ వైమానిక స్థావరం అత్యాధునిక విమానాలకు కేంద్రం. 10,000 అడుగుల రన్‌వే ఇక్కడి ప్రత్యేకత. అత్యవసర ల్యాండింగ్‌ స్ట్రిప్‌లు ఉన్నాయి. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని చక్వాల్‌లో మురీద్‌ ఉంది. ఇక్కడ కీలక వైమానిక స్థావరం ఉంది. మానవరహిత సాయుధ డ్రోన్లను ఇక్కడ నిల్వ చేస్తుంటారు. ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపంలోని రావల్పిండిలో నూర్‌ ఖాన్‌ (చక్లాలా) వైమానిక స్థావరం ఉంది. పాక్‌ ఉన్నతస్థాయి జనరల్స్‌ ఇక్కడ భేటీ అవుతారు. ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ కార్యాలయం కూడా చక్లాలాలోనే ఉంది. ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాలను భారత్‌ దెబ్బతీయడంతో పాకిస్థాన్‌కు ఎటూపాలుపోని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందే ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలనూ పేల్చివేయడంతో భారత క్షిపణులను శత్రు సైన్యం గుర్తించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను వినియోగించటం ఏమోగాని, వాటిని కాపాడుకోవటమూ కష్టమని స్పష్టం కావడంతో పాక్‌ నాయకత్వం చేతులెత్తేసింది. శనివారం మధ్యాహ్నానికి కాల్పుల విరమణకు సిద్ధమైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags

Next Story