RG Kar Case : కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ ఖైదు

RG Kar Case : కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ ఖైదు
X
మరణ దండన విధించకపోవడంపై బాధితుల అసంతృప్తి

దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్‌ రాయ్‌కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరణించే వరకూ జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. దోషికి రూ.50 వేల జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్‌.జి.కర్‌ ప్రభుత్వ ఆసుపత్రి-వైద్య కళాశాల సెమినార్‌ రూమ్‌లో నిద్రిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం కేసులో శనివారం న్యాయస్థానం పౌర వాలంటీర్‌ సంజయ్‌ను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. సోమవారం అతనికి శిక్ష ఖరారు చేసింది.

విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలిపై పాశవిక దాడికి పాల్పడిన ముద్దాయికి మరణ దండన విధించాలన్న ప్రాసిక్యూషన్‌ అభ్యర్థనను సియాల్దా అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్జి అనిర్బన్‌ దాస్‌ తోసిపుచ్చారు. అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి ఇది రాదంటూ యావజ్జీవ శిక్షను సమర్థించుకున్నారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)లోని..సెక్షన్‌ 64 (అత్యాచారం), సెక్షన్‌ 66 (ప్రాణహానికి కారణం కావడం), సెక్షన్‌ 103(1) (హత్య) కింద దోషికి శిక్షలు విధించినట్లు జడ్జి తెలిపారు. రూ.50 వేల జరిమానా చెల్లించని పక్షంలో దోషి మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన జరిగినందున పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి రూ.17 లక్షలను (విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినందుకు రూ.10 లక్షలు, అత్యాచారానికి గురైనందుకు రూ.7 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.

Tags

Next Story