Kolkata Doctor Rape Case: సీఎంతో మరోసారి చర్చలు జరపాలి: బెంగాల్ వైద్యులు
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు సీఎంతో మరోసారి సమావేశం ఏర్పాటుచేయాలని కోరారు. బాధితురాలికి పూర్తిగా న్యాయం జరిగేంతవరకు తమ నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఆరోగ్య కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం నుంచి రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసలు కొనసాగిస్తున్నారు. ‘‘మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేంతవరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. కోల్‌కతా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్‌ఎస్ నిగమ్‌ను విధుల నుంచి తొలగించాలి. అంతేకాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం అత్యవసరం. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు సీఎంతో మరోసారి చర్చలు జరపాల్సిన అవసరం ఉంది’’ అని వైద్యులు తెలిపారు.
సీఎం మమతాతో మరో సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్‌కు మెయిల్ పంపినట్లు వెల్లడించారు. ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులకు కల్పించే భద్రతతో పాటు ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నారనే అంశాలపై సమగ్రంగా చర్చించాలని పేర్కొన్నారు. కాగా.. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
వైద్య విద్యార్థుల ఐదు డిమాండ్లలో మూడింటిని దీదీ అంగీకరించారు. ఆందోళనకారుల డిమాండ్ మేరకు కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. ఈ క్రమంలోనే నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమిస్తూ దీదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి సీఎంతో సమావేశం ఏర్పాటుచేయాలని నిరసనకారులు అభ్యర్థిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com