Kolkata Doctor case: వైద్యురాలి మృతిపై వెలుగులోకి కొత్త విషయాలు

Kolkata Doctor case: వైద్యురాలి మృతిపై వెలుగులోకి  కొత్త విషయాలు
X
హత్యాచారం జరిగితే ఆత్మహత్య అంటూ సమాచారం

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమబెంగాల్‌ను కుదిపేస్తోంది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఆసుపత్రి నుంచి మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వెళ్లినట్లు సమాచారం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆ కాల్ చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది.

అయితే తర్వాత ఆ మృతిని హత్యగా గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పోలీసులు హత్యాచారం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ అధికారిని కూడా ప్రశ్నిస్తున్నారు. హత్యను ఆత్మహత్యగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క పోలీసులు ఏడుగురు జూనియర్ డాక్టర్లను ప్రశ్నించారు. అందులో నలుగురు ఆమెతో డిన్నర్ కూడా చేశారు.

తమ డిమాండ్లు నెరవేరే వరకు, న్యాయం జరిగేవరకు సమ్మెను విరమించబోమని ఇప్పటికే ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. నో సేఫ్టీ-నో డ్యూటీ అంటూ నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. వీరితోపాటుగా కోల్‌కతా, బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు వినూత్న ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం కోసం’ పేరిట రేపు రాత్రి 11.55 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు.

ఎక్కడెక్కడ నిరసనలు చేపట్టాలో ఆయా ప్రాంతాలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికి సంఘీభావంగా పలువురు పురుషులు కూడా ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. స్వస్తికా ముఖర్జీ, చర్నీ గంగూలీ, ప్రతిమ్‌ డి గుప్తా వంటి సినీ ప్రముఖులు మద్దతుగా రానున్నారు. సోమవారం బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారంలోగా కేసును పరిష్కరించాలని పోలీసులకు అల్టిమేటం జారీచేశారు. ‘‘ఈ కేసులో మరింతమంది నిందితులు ఉన్నట్లైతే వారందరినీ ఆదివారంలోగా అరెస్టు చేస్తాం. ఒకవేళ అప్పటిలోగా రాష్ట్ర పోలీసులు కేసును పరిష్కరించలేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తాం’’ అని తెలిపారు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ డిమాండ్ చేశారు.

ప్రాథమిక పోస్ట్‌మార్టమ్‌ నివేదిక ప్రకారం.. బాధితురాలి కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర భాగాల్లో కూడా గాయాలున్నట్లు తేలింది. అయితే.. వైద్యురాలిని మొదట హత్య చేసి.. ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి వెల్లడించారు.నిందితుడు సంజయ్‌ రాయ్‌ దర్యాప్తు సమయంలో ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా.. తనను ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలంటూ.. ఎదురుచెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి ఫోన్‌ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం.

Tags

Next Story