పదిలో ఫెయిల్.. కిడ్నాప్ డ్రామా ఆడి తండ్రిని కోటి డిమాండ్ చేసిన కూతురు

పదిలో ఫెయిల్.. కిడ్నాప్ డ్రామా ఆడి తండ్రిని కోటి డిమాండ్ చేసిన కూతురు
ఈ తెలివి తేటలు ఏదో చదువులో పెడితే మంచి మార్కులు వచ్చేవి కద తల్లీ అని పోలీసులు ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ తెలివి తేటలు ఏదో చదువులో పెడితే మంచి మార్కులు వచ్చేవి కద తల్లీ అని పోలీసులు ఆ బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని చెల్లిని తీసుకుని వెళ్లిపోయింది. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేసి పోలీసులకు దొరికి పోయింది. పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ శుక్రవారం 10వ తరగతి పరీక్ష ఫలితాలను ప్రకటించింది. దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో నివసించే బాలిక కూడా పరీక్షకు హాజరయ్యింది.

ఫలితాలు వెలువడిన తర్వాత, ఆమె తన మార్క్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి సైబర్ కేఫ్‌కి తన 6 ఏళ్ల సోదరితో కలిసి వెళ్లింది. వెళ్లిన ఇద్దరూ పిల్లలూ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.. పెద్దమ్మాయికి ఫోన్ చేసినా లిప్ట్ చేయలేదు. దాంతో కంగారు పడ్డ బాలికల అమ్మానాన్న పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి బాలికల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అనంతరం స్థానిక మెట్రో స్టేషన్ సమీపంలో బాలిక స్కూటీ కనిపించింది.

ఇంతలో, తమ కుమార్తెలు కిడ్నాప్‌కు గురయ్యారని, వారిని తక్షణమే విడుదల చేయడానికి కోటి రూపాయలు కావాలని తల్లిదండ్రులకు SMS వచ్చింది. డబ్బుతో నేపాల్‌గంజ్ ప్రాంతానికి రావాలని కూడా కోరారు. పోలీసుల విచారణలో, మైనర్ బాలిక మరియు ఆమె సోదరి సీల్దా రైల్వే స్టేషన్ నుండి కృష్ణానగర్ లోకల్ రైలు ఎక్కి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. అనంతరం గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. నదియా జిల్లాలోని డివైన్ నర్సింగ్ హోమ్ ముందు బాలికలిద్దరినీ గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో వారిని రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కోల్‌కతా పోలీసు వర్గాలు మాట్లాడుతూ, "విచారణలో, మైనర్ బాలిక 10వ తరగతి పరీక్షలలో 31% మార్కులు సాధించినట్లు తేలింది. పరీక్షలు బాగా రాశానని, మంచి మార్కులు వస్తాయని ఇంతకు ముందు తల్లిదండ్రులకు చెప్పి ఉంది. కానీ మార్కులు చూస్తే కనీసం పాస్ కూడా కాలేదు.. దాంతో ఇంటి నుంచి వెళ్లి పోయి తనకు తానే కిడ్నాప్ డ్రామా ఆడింది. తండ్రిని కోటి రూపాయలు డిమాండ్ చేసింది. తన సొంత తండ్రి నుండి డబ్బు దోపిడీకి ప్రయత్నించింది. పోలీసుల కౌన్సిలింగ్ తో బాలికలు ఇద్దరు తమ తల్లితదండ్రుల వద్దకు చేరారు.

Tags

Next Story