KKR vs SRH: ఫైనల్లో కోల్‌కతా

KKR vs SRH: ఫైనల్లో కోల్‌కతా
38 బంతులు మిగిలివుండగా 160 పరుగుల లక్ష్య ఛేదన

ఐపీఎల్-2024లో భాగంగా మంగళవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తోన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మూడేండ్ల తర్వాత మళ్లీ ఈ లీగ్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ మిచెల్‌ స్టార్క్‌ (3/34), వరుణ్‌ చక్రవర్తి (2/26)తో పాటు కేకేఆర్‌ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్‌ అయింది. భారీ హిట్టర్లు ఉన్న కోల్‌కతా ఈ లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తమ ఓపెనర్ల మీద ఎంతలా ఆధారపడిందో కోల్‌కతాతో మ్యాచ్‌ ద్వారా మరోసారి నిరూపితమైంది. కేకేఆర్‌ స్టార్‌ పేసర్‌ స్టార్క్‌, వైభవ్‌ అరోరా ఆరంభంలోనే హైదరాబాద్‌ను దెబ్బకొట్టి కోలుకోనీయకుండా చేశారు. పంజాబ్‌తో గత మ్యాచ్‌లో మాదిరిగానే స్టార్క్‌ తొలి ఓవర్లో రెండో బంతికే ట్రావిస్‌ హెడ్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. రెండో ఓవర్లో అరోరా బౌలింగ్‌లో.. అభిషేక్‌ శర్మ (3) క్యాచ్‌ను రస్సెల్‌ పట్టడంతో నిష్క్రమించాడు. స్టార్క్‌ ఐదో ఓవర్లో వరుస బంతుల్లో నితీశ్‌ రెడ్డి (9), షాబాజ్‌ను ఔట్‌ చేసి మరోసారి దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో రాహుల్‌ త్రిపాఠితో జతకలిసిన క్లాసెన్‌ (21 బంతుల్లో 32, 3 ఫోర్లు, 1 సిక్స్‌) .. సన్‌రైజర్స్‌ను ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరుబోర్డు వేగం పుంజుకుంది.

వికెట్‌ను కాపాడుకుంటూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని స్టాండ్స్‌లోకి పంపిన త్రిపాఠి.. 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. కానీ బౌలింగ్‌ మార్పుగా వచ్చిన వరుణ్‌ చక్రవర్తి.. 11వ ఓవర్లో క్లాసెన్‌ను ఔట్‌ చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. నరైన్‌ 14వ ఓవర్లో అబ్దుల్‌ సమద్‌ (16)తో సమన్వయ లోపం కారణంగా త్రిపాఠి రనౌట్‌ అవడంతో పాటు సన్వీర్‌ సింగ్‌ డకౌట్‌ అయ్యాడు. ఆఖర్లో సారథి పాట్‌ కమిన్స్‌ (24 బంతుల్లో 30, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులతో హైదరాబాద్‌ గౌరవప్రదమైన స్కోరుచేసింది.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా.. ఆది నుంచే హిట్టింగ్‌కు దిగింది. పవర్‌ ప్లేలో రెహ్మనుల్లా గుర్బాజ్‌ (14 బంతుల్లో 23, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సునీల్‌ నరైన్‌ (16 బంతుల్లో 21, 4 ఫోర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ నిష్క్రమించినా వారి స్థానాల్లో వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌, సారథి శ్రేయస్‌ అయ్యర్‌ దూకుడుగా ఆడారు. ఎదుర్కున్న తొలి బంతికే బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన వెంకటేశ్‌.. భువీ, కమిన్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడాడు. ఈ ఇద్దరూ బాదుతున్నా కమిన్స్‌ బౌలర్లను మార్చకపోవడంతో ఈ జోడీ స్వేచ్ఛగా ఆడి అర్ధ శతకాలతో పాటు మ్యాచ్‌నూ ముగించింది. పది ఓవర్లలోనే వంద పరుగుల మార్కును దాటిన కోల్‌కతా.. మరో 6.2 ఓవర్లు మిగిలుండగానే గెలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్‌ ఫైనల్స్‌లో ఆడటం కేకేఆర్‌కు ఇది నాలుగో సారి.

Tags

Next Story