Kolkata: తరగతి గదిలో విద్యార్థితో పెళ్లి .. లేడీ ప్రొఫెసర్ కీలక నిర్ణయం!

పశ్చిమ బెంగాల్‌లోని మౌలానా అబుల్‌కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో మహిళా ప్రొఫెసర్ ఓ విద్యార్థితో పెళ్లి చేసుకోవడం వైరలైన విషయం తెలిసిందే. ఇద్దరూ పూల దండలు మార్చుకుని, లేడీ ప్రొఫెసర్ నుదుట విద్యార్థి బొట్టు పెట్టాడు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట హల్‌చల్ చేయడంతో స్పందించిన వర్సిటీ యంత్రాంగం విచారణకు ఆదేశించింది. అలాగే ఆమెను అధికారులు సెలవుపై పంపారు.
ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ తాజాగా తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థకు పంపించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని, విధుల్లో కొనసాగలేనని ఆమె పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై విశ్వవిద్యాలయం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఆ పెళ్లి తంతు ఓ ప్రాజెక్టులో భాగమని ప్రొఫెసర్ చెబుతున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ సైకాలజీ విభాగాధిపతి అయిన మహిళా ప్రొఫెసర్.. తన డిపార్ట్‌మెంట్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్‌తో తరగతి గదిలోనే హిందూ బెంగాలీ వివాహ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వీడియో జనవరి 28న తెగ వైరల్ అయింది. ఇది పెద్ద దుమారం చెలరేగింది. అనంతరం ప్రొఫెసర్‌ను సెలవు పంపించారు. అంతేకాకుండా వర్సిటీ ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
అయితే వీడియో నెట్టింట పెద్ద దుమారం చెలరేగడంతో మహిళా ప్రొఫెసర్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ఈ మేరకు వర్సిటీ కార్యాలయానికి ఇ-మెయిల్ పంపించారని తెలిపారు. మానసికంగా ఇబ్బందిపడడమే కాకుండా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విశ్వవిద్యాలయంలో తన అనుబంధాన్ని కొనసాగించలేకపోతున్నట్లు ఆమె తెలిపినట్లు ఎంఏకేఏయూటీ రిజిస్ట్రార్ పార్థ ప్రతిమ్ లాహిరి పేర్కొన్నారు.
ఈ వీడియోను నాడియా జిల్లాలో ఎంఏకేఏయూటీలోని హరిన్‌ఘాటా క్యాంపస్ తరగదిలో చిత్రీకరించారు. అయితే డాక్యుమెంటేషన్ కోసం వీడియో చిత్రకరించినట్లుగా ప్రొఫెసర్ తెలిపారు. అయితే ఒక ప్రొఫెసర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి రచ్చ చేశారని ఆమె ఆరోపించారు. తన కెరీర్‌ను దెబ్బతీయడానికి.. తనను కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా సహోద్యోగి లీక్ చేశారని ఆమె పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com