Kolkata: ఆ భాషలో చదివిన వారికి నో అడ్మిషన్, కోల్‌కతా కాలేజీ వివాదాస్పద నిర్ణయం

కలకత్తాలోని లొరేటో కళాశాల ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వ్యావహారిక, స్థానిక భాషలో చదివిన విద్యార్థులకు ప్రవేశం లేదని తెలిపింది. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. కళాశాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. అయితే తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో కళాశాల తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వెంటనే ఒక క్షమాపణ లేఖని విడుదల చేసింది. కళాశాలలో బీఏ, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారి మెరిట్ లిస్ట్ ప్రకటించింది. ఇందులో స్థానిక భాషల్లో చదివిన విద్యార్థులను పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించింది. ఈ నిర్ణయమే తీవ్ర విమర్శలు, ఆందోళనలకు కారణమైంది. విద్యార్థుల మధ్య వైషమ్యాలు, భాషల మధ్య బేధ భావాలు సృష్టిస్తోందని విద్యార్థి సంఘాలు కళాశాల వద్ద ఆందోళనలు చేపట్టాయి. దీంతో అడ్మిషన్ల పాలనీని వెనక్కి తీసుకుంటున్నట్టు లేఖ విడుదల చేసింది.
"100 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన లొరెటో కళాశాలలో అనుకోని తప్పిదం జరిగింది. ఇటీవల ప్రకటించిన అడ్మిషన్ పాలసీ మా విలువలకు తగ్గట్టుగా లేదు. దీనిపై మేం చింతిస్తూ భేషరతుగా బెంగాల్ ప్రజల క్షమాపణ కోరుతున్నాం. సదరు అడ్మిషన్లను వెంటనే రద్దు చేస్తున్నాం. ఎప్పటిలాగే బెంగాల్ ప్రజలకు మేం ఎల్లపుడూ సేవ చేయడానికి ముందుంటాం." అని లేఖలో వెల్లడించింది.
ఈ ఇష్యూపై కలకత్తా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ దెబాసిస్ దాస్ స్పందిస్తూ అనుబంధ కళాశాలలు తేడాలు విద్యార్థుల మధ్య పక్షపాతం చూపే అటువంటి నియమాలు అమలు చేయడానికి వీలు లేదని వెల్లడించాడు. అడ్మిషన్లను రద్దు చేసిన కళాశాల మళ్లీ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com