Kozhikode: వేలికి చేయాల్సిన ఆపరేషన్ నాలుకకు

కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యం కొనసాగుతున్నది. తాజా సంఘటనలో బాధితుల కథనం ప్రకారం, నాలుగేళ్ల బాలికకు ఓ చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. చిన్న శస్త్ర చికిత్స చేసి, ఆరో వేలును తొలగించవచ్చునని వైద్యులు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించారు. బాలికకు బుధవారం ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకొచ్చిన పాప నోటికి ప్లాస్టర్ ఉండటంతో కుటుంబ సభ్యులంతా అవాక్కయ్యారు. ఇదేం నిర్వాకమని వైద్యుడిని తల్లిదండ్రులు ప్రశ్నించగా నోటిలో తిత్తి (ద్రవకోశం) ఉందని, అందుకే నాలుకకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ చెప్పాడని తల్లిదండ్రులు మండిపడ్డారు. బాలిక నోటిలో ఎలాంటి సమస్యా లేదని ఖండించారు. వైద్యుడి నిర్లక్ష్యాన్ని అవమానకరంగా భావిస్తున్నామని ధ్వజమెత్తారు. దీంతో డాక్టర్ వచ్చి, పొరపాటు జరిగిందని, క్షమించాలని కోరారు. ఆమెకు గల ఆరో వేలును తొలగిస్తానని చెప్పి ఆ బాలికను తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు.
కాగా ఇద్దరు పిల్లలకు ఒకే రోజు శస్త్ర చికిత్సలు జరగాల్సి ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని ఆసుపత్రి అధికారులు తమకు చెప్పారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన కేరళలో తీవ్ర దుమారం రేపింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అందిన నివేదికను పరిశీలించి మంత్రి వీణా జార్జ్ రంగంలోకి దిగారు. బాధ్యుడైన డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు. శస్త్రచికిత్సలు, ఇతర వైద్య ప్రక్రియలకు సంబంధించిన ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైద్యుడిపై పోలీసు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని), 337 (ఇతరుల జీవితానికి లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగిస్తూ గాయపరిచినందుకు) సెక్షన్లను చేర్చారు. కాగా ఘటనపై కేరళలో విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com