Kuwait : వేలాదిమంది పౌరసత్వం రద్దు చేసిన కువైట్..

కువైట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే వేలాదిమంది ప్రజల పౌరసత్వాన్ని రద్దు చేస్టున్నట్లు ప్రకటించింది. 2023లో అధికారంలోకి వచ్చిన కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ సబా ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేపట్టిన తర్వాత దేశంలోని రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పార్లమెంటును రద్దు చేసిన ఆయన.. కువైట్‌ను అసలైన ప్రజలకు శుద్ధి చేసి అందిస్తానని ఈ ఏడాది మార్చిలో మాటిచ్చారు. దీనిలో భాగంగానే రక్తసంబంధం ఉన్న వారికే కువైట్ పౌరసత్వం ఉంటుందనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే రెండు దేశాల పౌరసత్వాలు ఉన్న వారి కువైట్ పౌరసత్వాన్ని కూడా రద్దు చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో 37 వేలమందికి పైగా ప్రజలు పౌరసత్వం కోల్పోయారని, వీరిలో కనీసం 26 వేలమంది మహిళలు ఉంటారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే వాస్తవ సంఖ్య దీనికి ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒక్క నిర్ణయంతో కువైట్ పౌరులను పెళ్లి చేసుకొని ఆ దేశంలో స్థిరపడిన మహిళలంతా పౌరసత్వం కోల్పోయారు. 1987 నుంచి కువైట్ పౌరులను వివాహం చేసుకున్న మహిళలకు ఆ దేశ పౌరసత్వం అందజేస్తూ వచ్చారు. 1993 నుంచి 2020 మధ్య ఇలా కనీసం 38,505 మంది మహిళలు కువైట్ పౌరసత్వం పొందినట్లు అంచనా. ఇప్పుడు వీరందరూ పౌరసత్వం కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com