RAINS: కుప్పకూలిన 450 ఏళ్లనాటి పురాతన భవనం
దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు చాలా ప్రాంతాల్లో ఆపార ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఆకస్మికంగా వరద పోటెత్తడంతో భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. జమ్ముకశ్మీర్‌లో కురిసిన కుండపోత వరద పోటెత్తుతోంది. నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. లేహ్‌లోని ఖరౌక్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి 450 ఏళ్ల క్రితం నాటి పురాతన భవనం కుప్పకూలింది. గతంలో ఎన్నో విపత్తులను తట్టుకొన్న ఈ భవనం నిన్న కురిసిన భారీ వర్షాల ధాటికి కుప్పకూలిందని స్థానికుడు హైదర్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా లద్ధాఖ్‌లో పురాతన ఇళ్లు చాలా దెబ్బతిన్నాయని... గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన భవనాలు నేలకూలడం వేదనకు గురి చేసిందని స్థానికులు తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది భారీగా వర్షపాతం నమోదైందని... చాలా ఇళ్లలోకి వరద పోటెత్తిందని వాపోయాడు. 2010లోనూ భారీ వర్షాలు కురిసినా ఇంత నష్టం జరగలేదని ఈసారి ఎప్పుడూ చూడని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. లద్దాఖ్‌లో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసేశారు. భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోతున్నాయని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోవడంతో తాము ఎక్కకైనా వెళ్లాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుందని వాపోయారు . ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
జమ్ముకశ్మీర్‌లోనూ ఉజ్ నదికి సమీపంలో వివిధ ప్రదేశాలలో ఆకస్మిక వరదల కారణంగా చిక్కుకుపోయిన 36 మందిని జమ్ముకశ్మీర్ పోలీసులు, SDRF బృందాలు సంయుక్తంగా రక్షించాయి. ఇంకొంతమంది వరదల్లో చిక్కుకున్న సమాచారంతో విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
లేహ్‌లో గత 9 గంటల్లోనే రికార్డు స్థాయిలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, ఇతర ఘటనలలో మృతుల సంఖ్య 19కు పెరగగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది ప్రమాదకరస్థాయిని దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఢిల్లీలోనూ యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మధ్యప్రదేశ్‌లో నర్మద నదిలో చిక్కుకున్న నలుగురిని NDRF బృందాలు అతి కష్టం మీద రక్షించాయి. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత వారి ఆచూకీ కనిపెట్టిన NDRF.... సురక్షితంగా రక్షించింది. రక్షించిన తర్వాత వారికి బిస్కెట్లు, నీరు సహా ఆహారాన్ని అందించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com