ఆరు ఎత్తయిన కొండలు.. భారత సైన్యం స్వాధీనం

భారత్-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లోఆరు ఎత్తయిన కొండలు.. భారత సైన్యం స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్ హిల్, గురుంగ్ హిల్, రిసెహెన్ లా, రెజంగ్ లా, మొఖ్పారీ, ఫింగర్ 4 సమీపంలో మరో ఎత్తయిన ప్రాంతం ఉన్నాయని తెలిపాయి. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకంగా వ్యవహరించే ఈ ఆరు పర్వత ప్రాంతాలపై భారత సైనికులు జెండా పాతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. .
చైనా ముందుగా ఆయా కొండలను ఆక్రమించి భారత్‌ను దెబ్బ తీయాలని భావించినప్పటికీ.. భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ ఆరు పర్వతాలు భారత భూభాగంపైనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అదే సమయంలో బ్లాక్ టాప్, హెల్మెట్ టాప్ పర్వతాలు వాస్తవాధీన రేఖకు అటువైపు ఉన్నాయని, వాటిని తమ నియంత్రణలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. దీని ద్వారా ఇప్పుడు మన దళాలకు శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం మరింత సులువు అవుతుంది. అలా చైనా ప్రయత్నాలు విఫలం కావడంతో పాంగాంగ్ ఉత్తర ప్రాంతంలో డ్రాగన్ సైన్యం మూడు సార్లు గాల్లోకి కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో రెజంగ్ లా, రెచెన్ లా కొండల సమీపంలో చైనా ఆర్మీ 3వేల అదనపు సాయుధ బలగాలను మోహరించింది. డ్రాగన్ సైన్యం పలు విధాలుగా రెచ్చగొట్టేందుకు యత్నిస్తుండటంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణేల పర్యవేక్షణలో భారత భద్రతా దళాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి.
తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు త్వరలో భారత్, చైనా కమాండర్ స్థాయి అధికారులు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలు పాంగోంగ్ సరస్సు వద్ద జరపడానికి సిద్ధంగా ఉన్నాయని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఇరు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలుపై ప్రధాన దృష్టి సారించడమే లక్ష్యంగా సమావేశం జరగనుంది. భారత్, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖను మార్పు చేసేందుకు చైనా యత్నించడంతో గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జూన్‌లో గల్వాన్ వ్యాలీ సమీపంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హద్దులు మీరి 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com