Lalu Prasad Yadav: లాలూప్రసాద్ యాదవ్‌కు మరోసారి అస్వస్థత..

Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉన్నప్పటికీ ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు దాణా స్కాంలోని డొరండా ఖజానా కేసులో లాలూకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది. లాలూతో పాటు మరో 99 మంది నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని న్యాయస్థానం.. జనవరి 29న తీర్పును రిజర్వులో ఉంచగా.. ఇప్పటికే ఈ కేసులో లాలూను దోషిగా తేల్చింది కోర్టు. సోమవారం తుది తీర్పును వెల్లడించిన న్యాయస్థానం ఈ కేసులో మరో 46 మందికి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించింది. 24 మందిని నిర్దోషులుగా తేల్చింది.
దాణా స్కామ్‌లో తన తండ్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి జైలు శిక్ష పడటంపై కుమారుడు, బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దాణ స్కాము కాకుండా మరే స్కామూ లేదా అని ప్రశ్నించారు. బీజేపీపై పోరాటం చేస్తున్న కారణంగానే లాలూ జైలుకు వెళ్లాల్సి వస్తోందని, ఒకవేళ కమల పార్టీకి అనుకూలంగా ఉండుంటే రాజా హరిశ్చంద్ర బిరుదు లభించేదని అన్నారు. సోమవారం లాలూకి రాంచీ సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన అనంతరం తేజస్వీ మీడియాతో మాట్లాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com