Lalu : లాలూకు షాకిచ్చిన ఈడి

ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. యూపీఏ ప్రభుత్వంలో లాలూ రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు ఈ కుంభకోణానికి పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. భూములకు ఉద్యోగాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రాష్ట్రీయ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి చెందిన రూ.6 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.
లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు బీహార్‌లో విలువైన భూములు తీసుకుని రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలు కల్పించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే లాలూ కుటుంబ సభ్యులను ఈడీ విచారించింది. తాజాగా లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమార్తె మీసాభారతికి చెందిన విలువైన ఆస్తులను సీజ్ చేసింది.
యూపీఏ ప్రభుత్వం 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణం వెలుగుచూసింది. ప్రభుత్వం ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం 2022లో లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమ యాదవ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రతిభ ప్రాతిపదికగా కాకుండా ఆశ్రితపక్షపాతంపై లాలూ కార్యాలయం నియామకాలు జరిపినట్టు విచారణలో వెల్లడైంది. రైల్వే మంత్రిగా లాలూ అధికార దుర్వినియోగానికి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు లబ్ధి చేకూర్చారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నారు.
2004-2009 మధ్య పాట్నాకు చెందిన పలువురుని గ్రూప్-డి పోస్టుల్లో రిక్రూట్ చేశారని, ఈ పోస్టుల కోసం ఎలాంటి అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇవ్వలేదని, రిక్రూట్‌మెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు జరిగాయని తెలిపింది. ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హజీపూర్ వంటి వివిధ రైల్వే జోన్లలో అభ్యర్థుల నియామకాలు జరిగాయని పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా లక్ష చదరపుటడుగుల భూమిని కేవలం రూ.26 లక్షలకే లాలూ కుటుంబ సభ్యులు సేకరించారని, వీటి అసలైన విలువ రూ.4 కోట్లపైమాటేనని సీబీఐ ఆరోపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com