Lalu Prasad Yadav: పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ పై లాలూఆరేళ్ల బహిష్కరణ వేటు

Lalu Prasad Yadav: పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ పై  లాలూఆరేళ్ల బహిష్కరణ వేటు
X
బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్లేనని వెల్లడి

‘బాధ్యతా రాహిత్య ప్రవర్తన’ కారణంగా తన పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను(37) పార్టీ నుంచి ఆరేండ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆదివారం ప్రకటించారు. అతడితో అన్ని కుటుంబ సంబంధాలూ తెంచుకుంటున్నట్టు తెలిపారు. ‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం సామాజిక న్యాయం కోసం మనమంతా చేసిన సమష్టి కృషిని బలహీనపరుస్తుంది. నా పెద్ద కొడుకు చేస్తున్న పనులు, అతడి ప్రవర్తన, బాధ్యతా రాహిత్యం మా కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. ఈ కారణాల వల్ల అతడిని పార్టీ, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నా.

ఇక నుంచి పార్టీ, కుటుంబంలో అతడికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఆరేండ్ల పాటు అతడిని పార్టీ నుంచి బహిష్కరించాను’ అని లాలూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. తానొక యువతితో ‘సంబంధం’ కలిగి ఉన్నానని తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే తన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయిందని.. తన ఫొటోలను ఎవరో తప్పుగా ఎడిటింగ్‌ చేశారని శనివారం రాత్రి ఆయన తెలిపారు. అయితే ఈలోగా తేజ్‌ ప్రతాప్‌ చేసిన రిలేషన్‌షిప్‌ పోస్ట్‌ వైరలైంది.

తేజ్ ప్రతాప్ యాదవ్ 2018లో బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే వీరిద్దరు విడిపోయారు. అనుష్క యాదవ్‌తో 12 ఏళ్లుగా ప్రేమలో ఉంటే ఐశ్వర్యని ఎందుకు పెళ్లి చేసుకున్నారని బీజేపీ, జేడీయూ నేతలు ప్రశ్నిస్తున్నారు. తేజ్ ప్రతాప్ ఇద్దరు అమ్మాయిల జీవితాలను నాశనం చేశారని విమర్శిస్తున్నారు. ఆ సమయంలో రాజకీయ కారణాలు, ఇతర సమీకరణాల్లో భాగంగా, కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే తేజ్ ప్రతాప్ ఈ వివాహానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు దీనిపై బీజేపీ, జేడీయూలు లాలూ ఫ్యామిలీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.

Tags

Next Story